హుజురాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్, అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసీఆర్ ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోనివి సృష్టించి ఘోష్ కమిషన్ల పేరిట కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్‌ను దూరం చేయడం ఎవరి తరం కాదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం మీద వేసింది బీసీ ఘోష్ కమిషన్ కాదని పీసీసీ కమిషన్ అని అన్నారు. ప్రభుత్వానికి కనీసం రైతులకు యూరియా ఇవ్వడం కూడా సాధ్యం కావడంలేదని విమర్శించారు. రైతులకు వెంటనే యూరియా పూర్తిస్థాయిలో అందించాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.