Putta Madhukar| మంథని, డిసెంబర్ 30: మాటకు ముందు ఒకసారి.. మాటకు వెనుక ఒకసారి తండ్రి ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చానని.. ఆయన ఆశయ సాధన కోసం పని చేస్తున్నానని అంటున్న మంథని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసలు ఆయన తండ్రి ఆశయాలు ఏంటో ఈ సమాజానికి ముందుగా తెలియజేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. తండ్రి ఆశయాలంటే చిన్న కాళేశ్వరం పూర్తి చేస్తానని చెప్పి ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడమా..? ఎమ్మెల్యేగా గెలిచిన రెండు రోజులకే ఇసుక బంద్ చేయిస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు ఇసుక బంద్ చేయించకపోవడమా..? యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మభ్యపెట్టి ఇప్పటివరకు నలుగురికి ఉద్యోగాలు పెట్టించకపోవడమా..? ఇవేనా తండ్రి ఆశయాలంటే అంటూ పుట్ట మధుకర్ ప్రశ్నించారు.
మంథనిలో అంబేద్కర్ రస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధుకర్ మాట్లాడుతూ.. మంథని ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ చెప్పిన మాటలను రికార్డు ప్రకారం అడిగితే సమాధానం చెప్పకుండా దొంగచాటున చీకట్లో వీడియోలు పెట్టించడంతో పాటు చెప్పులతో కొట్టిస్తానని తన పార్టీలోని బడుగు, బలహీన వర్గాల నాయకులతో అనిపిస్తున్నాడన్నారు. తనను తిట్టే కాంగ్రెస్ నాయకులు తనకు శత్రువులు కాదని.. నాకు మంత్రి శ్రీధరే శత్రువన్నారు. మూడు ఓట్లు.. మూడు వందల కుటుంబాలు ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40 ఏండ్లుగా అధికారం ఇస్తే ఆ కుటుంబం ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమాజాన్ని మేల్కొల్పాలనేదే నా తపన..
మా ఆకలి కష్టాలు తీర్చాలని, నా ప్రజల కన్నీళ్లు తుడువడానికి తాను పోరాటం చేస్తున్నానని.. ఈ సమాజాన్ని మేల్కొల్పాలనేదే తన తపన అని పుట్ట మధుకర్ అన్నారు. అలాంటి తనను తన నాయకులతో చెప్పులతో కొట్టిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. తాను ఊకదంపుడు బెదిరింపులకు భయపడనన్నారు. పనాడు శ్రీపాదరావు మరణిస్తే తాను దుద్దిళ్ల శ్రీధర్‌ను రాజకీయాల్లోకి తీసుకువచ్చి శ్రీధర్‌బాబు అని నామకరం చేసి రాజకీయ ఓనమాలు నేర్పించానని గుర్తు చేశారు. అన్నం పెట్టి ఆదరిస్తే ఈనాడు తనను చెప్పులతో కొట్టిస్తానని మాట్లాడిస్తున్నాడన్నారు. తనకు దుద్దిళ్ల కుటుంబ చరిత్ర తెలిసినంతగా ఈ నియోజకవర్గంలో ఎవరికి తెలియదని, దుద్దిళ్ల శ్రీధర్ అన్న, తమ్ముడు, చెల్లెతోపాటు తన సొంత కుటుంబ విషయాలతోపాటు ఆయన తండ్రి చావు విషయాలు కూడా తెలుసన్నారు.
కుటుంబ చరిత్ర చిట్టా మొత్తం విప్పుతా..
శ్రీధర్ బాబు తమ్ముడి బోగస్ కంపెనీలు ఎలా నడుస్తున్నాయో కూడా తెలుసునన్నారు. దుద్దిళ్ల శ్రీధర్ బాబు మారకపోతే కుటుంబ చరిత్ర చిట్టా మొత్తం విప్పుతానన్నారు పుట్ట మధుకర్. దుద్దిళ్ల శ్రీధర్ బాబుపై 19వేల మెజార్టీతో చిత్తు చిత్తుగా ఓడించిన తనను చెప్పుతో కొట్టిస్తాననిపించడం ఎంత వరకు సమంజసమో సమాజం ఆలోచన చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయకుడినని, 35 ఏండ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్న తనను తిట్టించడమేంటని ప్రశ్నించారు. తాను అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నానన్నారు. తాను తుపాకి పట్టుకుని తిరుగడం లేదని రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్నానన్నారు. రూ.900కోట్లు సంపాదించినా అని బదనాం చేసి ప్రజలకు దూరం చేయించారని మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు ఇప్పటి వరకు రూ. 9 కూడా చూపించలేదని, తనను గుండా, రౌడీ మర్డరిస్ట్ అంటున్నారన్నారు.
నేను రౌడీని అయితే నాపై ఇలాంటి మాట్లాడటానికి కాంగ్రెస్ నాయకులు ధైర్యం చేస్తారా అని ప్రశ్నించారు. నిజంగా దుద్దిళ్ల శ్రీధర్ అంటేనే భయపడుతున్నారనే విషయం ప్రతీ ఒక్కరికి తెలుసునన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నానని, తన కంఠంలో తుది శ్వాస ఉన్నంత వరకు పోరాటం చేస్తానని ఆయన ఈ సందర్బంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ, బీఆర్ఎస్ నాయకులు జక్కు రాకేష్, ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, ప్రసాద్‌రావు, కనవేన శ్రీనివాస్, మాచీడి రాజు గౌడ్, పొట్ల శ్రీకాంత్, జంజర్ల శేఖర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Sannia Ashfaq: నా ఇంటిని ముక్కలు చేశారు.. విడాకులపై పాకిస్థాన్ క్రికెటర్ భార్య ఆవేదన