Sanju Samson : టీ20 వరల్డ్ కప్, సూపర్ 8లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో ఇండియా ఘోర పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో ఓటమితో టీమిండియాలో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా యంగ్ ఓపెనర్ సంజూ శాంసన్ జట్టులో తిరిగి చేరే అవకాశాలున్నాయి. సంజూ శాంసన్‌ను ఆడించే అంశంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని టీం భావిస్తోంది. ఇటీవల టీమిండియా బ్యాటింగ్‌లో విఫలమవుతోంది. ముఖ్యంగా బ్యాటర్లు త్వరగా వికెట్లు కోల్పోతున్నారు. తొలి ఓవర్లలోనే వికెట్లు పోతున్నాయి. దీంతో భారత్ భారీ స్కోరు సాధించలేకపోతుంది. అందుకే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సితాన్షు కోటక్ తెలిపాడు. బ్యాటింగ్‌కు సంబంధించి లెఫ్ట్ హ్యాండర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే రైట్ హ్యాండర్ అయిన సంజూను ఆడిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని కోటక్ ఆలోచిస్తున్నాడు. సంజూను తీసుకుంటే ఒక లెఫ్ట్ హ్యాండర్, ఒక రైట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తారు. ఇది మంచి ఫలితం ఇస్తుందని జట్టు యోచన. ప్రస్తుతం సంజూతో నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నారు. దీనర్థం సంజూ తుది జట్టులో ఆడటం గ్యారెంటీ అని కాదని కోటక్ అన్నాడు.
సంజూను ఆడించాలంటే జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరం. లోయర్ ఆర్డర్లో శివమ్ దూబేపై వేటు పడొచ్చు. లేదా తిలక్ వర్మను తప్పించి, అతడి స్థానంలో సంజూను తీసుకురావొచ్చు. టీ20లో జట్టు ప్రదర్శనకు సంబంధించి గత రెండేళ్లలో ఇదే అధ్వానం అనేది నిపుణుల మాట. గురువారం జింబాబ్వేతో జరగబోయే టీ20 మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఇండియా సెమీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచులో గెలవడం చాలా ముఖ్యం.