Jana Nayagan | తమిళ చిత్ర పరిశ్రమలో ‘దళపతి’ విజయ్ క్రేజ్ మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఆయన తన సినీ కెరీర్లో నటిస్తున్న చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ (Jana Nayagan) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మలేషియాలో నిర్వహించిన మూవీ ఆడియో లాంచ్ వేడుక మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్రను సృష్టించింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లోని ప్రసిద్ధ బుకిట్ జలీల్ నేషనల్ స్టేడియంలో డిసెంబర్ 27న జరిగిన ఈ వేడుకకు అభిమానులు పోటెత్తారు. దాదాపు 85,000 మందికి హాజరైనట్లు నిర్వహాకులు వెల్లడించారు. మలేషియా గడ్డపై ఒక భారతీయ సినిమా వేడుకకు ఈ స్థాయిలో జనం రావడం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఈవెంట్ ‘మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించి సరికొత్త రికార్డును నెలకొల్పింది. త్వరలో పూర్తిస్థాయి రాజకీయాల్లోకి (TVK పార్టీ) ప్రవేశించనున్న నేపథ్యంలో విజయ్ చేసిన ప్రసంగం అభిమానులను ఉర్రూతలూగించింది.
హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమా జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విజయ్ ఆఖరి సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.