వరంగల్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘నాది శాడిస్టిక్ ప్లెజర్. మీరు బాధపడితే.. నేను సంతోషిస్తా’ అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం దేవాదుల పంప్‌హౌస్ వద్ద సీఎం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘మంచి ఆలోచనలు చేయండి.. ఆరోగ్యంగా ఉండండి’ అంటూ సలహా ఇచ్చా రు. ‘లోకకల్యాణం కోసం ప్రవచనాలు వినండి.. అంతే తప్ప ప్రజలను తప్పు పట్టి, మమ్మల్ని శపిస్తే ఏం జరుగదు.
పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. శాపనార్థాలు ఎన్ని పెట్టినా సంతోషం, నాది శాడిస్టిక్ ప్లెజర్..! అబ్బా బాగుంది కదా! అని అనిపిస్తుంది. గోదావరి, కృష్ణా జలాలపై అబద్ధాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు అతికేలా ఉండాలి. గోదావరి జలాల వివాదాలు, వినియోగంపై శాసనసభలో సంపూర్ణంగా చర్చించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ను కోరుతున్నా. ఎలాంటి సమస్య అయినా చర్చలతో పరిష్కారమవుతుంది’ అని పేర్కొన్నారు.