Harsha Narra | టాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’. హర్ష నర్రా, తన్మయి ఖుషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో అత్యంత వైభవంగా జరిగింది. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రానికి సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరాలు సమకూర్చగా, గీత రచయిత కిట్టు విస్సప్రగడ ఆకట్టుకునే సాహిత్యమందించిన ‘బెటర్ బీ ఏ మిస్సమ్మ’ మొదటి పాటను మేకర్స్ విడుదల చేశారు. ట్రెడిషనల్ లుక్‌లో హీరో హీరోయిన్లు కనిపించిన ఈ పాట మహిళలను ఎంతగానో ఆకట్టుకునేలా ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ వేడుకలో చిత్ర బృందం మాట్లాడుతూ సినిమాపై తమ అంచనాలను పంచుకున్నారు.
ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ చక్కగా ఎంజాయ్ చేస్తారని ‘వదల’ చిత్ర నిర్మాత కిశోర్ నాయుడు ప్రశంసించారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు లాగే సినిమా చేసి చూడు అనడంలో ఎంతో అర్థం ఉందని దర్శకుడు సాయిబాబా తెలిపారు. రెండేళ్ల ప్రయాణం తర్వాత ట్రెండ్‌కు తగ్గట్టుగా, అందరికీ రిలేట్ అయ్యేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత చిరంజీవి పమిడి పేర్కొన్నారు. ఈ చిత్రంలో సిజు ఏఆర్, ప్రమోదిని, హారిక, డా. భద్రం, శివన్నారాయణ, రాకేష్ రాచకొండ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.