న్యూఢిల్లీ: శీతాకాలంలో వాయు కాలుష్య సమస్యను ముందుగానే ఎదుర్కొనేందుకు ఢిల్లీ సర్కార్ సోమవారం పలు చర్యలను ప్రకటించింది. డిసెంబర్ నుంచి నిర్మాణ, కూల్చివేత పనులను పూర్తిగా నిషేధిస్తున్నట్టు వెల్లడించింది. ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు నవంబర్ 1 నుంచి పార్కింగ్ రుసుములను రెట్టింపు చేయనుంది.
అదే రోజు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల్లో 50 శాతం ఇంటి నుంచి పని చేస్తారని పేర్కొన్నది. కొన్నేండ్లుగా ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తున్నది. వాతావరణం పొడిగా ఉంటూ, గాలుల తీవ్రత తక్కువగా ఉంది. దీని వల్ల కాలుష్య కారకాలు పేరుకుపోతున్నాయి. ఢిల్లీలో ఏడాది పొడవునా వాయు కాలుష్య నియంత్రణకు తగిన చర్యలు చేపడుతున్నట్టు సీఎం రేఖా గుప్తా తెలిపారు. వాయు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను సోమవారం ఆమె ఒక సమావేశంలో సమీక్షించారు.