ముంబై, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయ ప్రాంతంలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని చాలా చాకచక్యంగా దొంగతనాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించడానికి ఆ ముఠా దొంగలు ప్రతి అరగంటకు ఒకసారి దుస్తులు మార్చుకుని జనంలో కలిసి పోయేవారు.
ఈ ముఠాలోని ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఒక పిల్లవాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక నిందితుడు తప్పించుకొని పారిపోయాడు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. నిందితుల నుంచి 10 ఖరీదైన మొబైల్ ఫోన్లు, రూ.1,170 నగదు స్వాధీనం చేసుకున్నారు. పదునైన బ్లేడ్లు, పర్సులు కట్ చేయడానికి ఉపయోగించే కట్టర్లను వీరి వద్ద గుర్తించారు.