ఖలీల్వాడి /కంఠేశ్వర్, ఫిబ్రవరి 22: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కార్యక్రమం ఐదోసారి విజయవంతమైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రెండురోజులపాటు నిర్వహించిన ఆటోషో ఆదివారం ముగిసింది. అన్ని కంపెనీలకు చెందిన వాహనాలను ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి ప్రదర్శించారు. వాహనాల ప్రదర్శనకు భారీ సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. స్టాళ్లను సందర్శించి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వాహనాల వివరాలను తెలుసుకున్నారు.
కొందరు కొత్తబైక్లను చూసేందుకు వచ్చి టెస్ట్ డ్రైవ్ చేశారు. మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి కార్లు, బైక్లు కొనుగోలు చేశారు. స్పాట్ బుకింగ్ , స్పాట్ క్యాష్ చెల్లించి వాహనాలను సొంతం చేసుకున్నారు. ఆటోషో ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో సందడిగా మారింది. మరో రెండు రోజులు వాహన ప్రదర్శన నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రతిఏటా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషో కార్యక్రమం విజయవంతమవుతుండగా, ఈసారి కార్లు, బైక్ల విక్రయాలు జోరుగా సాగాయి. ఒకే వేదికపై అన్ని కంపెనీల కార్లు, బైక్లు ప్రదర్శించడంతో వినియోగదారులు తమకు నచ్చిన వాహనాన్ని ఎంచుకునే అవకాశం కలిగింది.
ఈ ఆటోషోలో ఎలక్ట్రికల్ కార్లు, బైక్లు దర్శనమిచ్చాయి. వాటిని కొనుగోలుపై నగరవాసులు ఆసక్తి చూపారు. కార్యక్రమంలో మెయిన్ స్పాన్సర్ కియా సన్రైజ్, ప్రకాశ్ హ్యుందయ్, టాటామోటర్స్ ( శ్రీ వెంకటేశ్వర మోటర్స్), నెక్సా (మారుతి సుజుకీ), హర్ష టాయోటా, గ్రీన్ హోండా, నిస్సాన్ (లక్ష్మి నిస్సాన్), వరుణ్మోటర్ ( మారుతీ సుజుకీ) ఆటోమోటివ్ మహేంద్ర, వెంకటేశ్వర్ హీరో, లక్ష్మి టీవీఎస్, దేవి ఆటోమొబైల్స్ రాయల్ ఎన్ఫీల్డ్, విజయ గణపతి చేతక్, హోండా (శ్రీరామ్ హోండా) కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. కార్యక్రమంలో మెయిన్ స్పాన్సర్ కియా జనరల్ మేనేజర్ సతీశ్, బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ కడార్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.


Nizabad