అటవీ ప్రాంతాలోని ఆదివాసులకు వేసవిలో అటవీ ఉత్పత్తుల సేకరణే ప్రధానమైన జీవనో పాధి. ఇప్పపూలు, ఇప్పపరక, చిల్ల గింజలు, తేనే, జిగురు వంటి ఉత్పతులను సేకరించి వాటిని గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలోని డీఆర్ డిపోల్లో విక్రయించి ఉపాధి పొందుతారు. ఏడాదిగా అటవీ ఉత్పత్తుల సేకరణపై గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ఆసక్తి చూపడం లేదు. ఒక వేళ కొనుగోలు చేసినా మార్కెట్ కన్నా తక్కువ ధర చెల్లిస్తున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమకు ఉపాధి కరువై జీవనాధారం కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ)
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 15 మండలాల్లో 13 మండలాలు గిరిజన మండలాలే.. వర్షాకాలంలో వ్యవసాయం చేసుకునే గిరిజనులు వేసవిలో మార్చి, ఏప్రిల్, మే మూడునెలల పాటు అటవీ ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడి జీవిస్తారు. అడవుల్లో దొరికే ఇప్పపూలు, ఇప్పపరక, చిల్ల గింజలు, చింతగింజలు, తేనే, జిగురు, మైనం వంటి అటవీ ఉత్పత్తులను సేకరించి జీసీసీ డీఆర్డీపోల్లో అమ్ముకొని ఉపాధి పొందుతారు. ప్రతి ఏటా ఫిబ్రవరిలో అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించిన రేట్లను జీసీసీ సవరించి గిరిజనులు గిట్టుబాటయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి. కాని ఈ ఏడాది జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి చర్యలను అధికారులు చేపట్టడం లేదు. గిరిజనులు అత్యధికంగా నివసించే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గతేడాది కూడా అరకొరగానే అటవీ ఉత్పతులను కొనుగోలు చేశారు. ఈ ఏడాది అటవీ ఉత్పత్తుల సేకరణ ఊసే ఎత్తకపోవడంపై ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. అటవీ ఉత్పత్తుల సేకరించకపోతే ఆదివాసీలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
అడవుల్లో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తుల సేకరణను ప్రోత్సహిస్తూ వాటిని కొనుగోలు చేయాల్సిన జీసీసీ అధికారులు అసలు జిల్లాలో అటవీ ఉత్పత్తుల సేకరణే జరుగడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జీసీసీ ద్వారా గిరిజనులు అడవుల్లో సేకరించే ఇప్పపూలు, చిల్లగింజలు, జిగురు వంటి ఉత్పత్తులు కొనలేదు. అత్యధికంగా గిరిజన గ్రామాలున్న ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ఉత్పత్తుల సేకరణలో ముందంజలో ఉండాల్సిన జిల్లాలోనే అటవీ ఉత్పత్తుల సేకరణ అరకొరగా సాగుతున్నది. అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేయడంలో అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు సేకరించే విలువైన అటవీ ఉత్పత్తులు ప్రైవేట్ వ్యాపారుల పరమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దొరకడం లేదు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే అప్పగించాల్సి వస్తున్నదని వాపోతున్నారు.
జిల్లాలో గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలను కల్పించడంలో జీసీసీ అధికారులు విఫలమవుతున్నారు. రాత్రనకా పగలనకా ప్రాణాలకు తెగించిన గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు అధికారులు నామమాత్రంగా రేటు చెల్లిస్తున్నారు. తేనె ధర బయటి మార్కెట్లో రూ.500 నుంచి 600 రూపాయల వరకు పలుకుతుంటే జీసీసీ అధికారులు మాత్రం 150 రూపాయలకు కిలో చొప్పున కొనుగోలు రేటును నిర్ణయిస్తున్నారు. ఇప్పపూలకు బయటి వ్యాపారుల వద్ద కిలోకు రూ.40 ధర ఉంటే జీసీసీలో మాత్రం 20 రూపాయలే చెల్లిస్తున్నారు. ఇలా అన్ని అటవీ ఉత్పత్తుల్లోనే అధికారులు బయటి మార్కెట్ రేటులో సగం కూడా చెల్లించడం లేదు. గిట్టుబాటు ధరలను కల్పించి గిరిజనులకు అండగా నిలవాల్సిన జీసీసీ సరైన ధరలు కల్పించకుండా వ్యవహరిస్తున్నది.
జిల్లాలో అటవీ ఉత్పత్తుల సేకరణ జరగడం లేదని, గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణ మానుకుంటున్నారనే వాదనను వినిపిస్తున్నది. దీంతో అటవీ ఉత్పత్తుల సేకరణ చేసేందుకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. దీంతో ఆరోగ్యానికి ఎంతో విలువైన అటవీ ఉత్పత్తులు అడవుల పాలవుతున్నాయి. జీసీసీ నిర్వాకంతో ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తున్నది. గిరిజనులు కష్టపడి సేకరించే అటవీ ఉత్పత్తులను జీసీసీ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఉన్న డీఆర్డీపోల్లో గిరిజనులకు గిట్టుబాటు అయ్యే ధరల్లో అటవీ ఉత్పత్తులను కొనాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలోనే అటవీ ఉత్పత్తుల కొనుగోలు రేట్లను పెంచి గిరిజన గ్రామాల్లో తెలియజేయాల్సి ఉంటుంది.
తేనె, ఇప్పపూలు, ఇప్పపరక, జిగురు, మైనం, చిల్లగింజలు మొదలైన అటవీ ఉత్పత్తులకు డీఆర్ డిపోల్లో కొనుగోళ్లను చేపట్టాలి. కాని అధికారులు అటవీ ఉత్పత్తులను కొనే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో అటవీ ఉత్పత్తులను అమ్ముకునేందుకు గిరిజనులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గిరిజనులు సేకరించే ఇప్పపూలను బహిరంగా మార్కెట్లో విక్రయించే వీలుండదు.. జీసీసీ ఏర్పాటు చేసిన డీఆర్డీపోల్లోనే విక్రయించాలి. ఇప్పటికైనా గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు జీసీసీ ద్వారా గిట్టుబాటు ధరలు కల్పించి డీఆర్డీపోల్లో కొనుగోలు చేసి తమకు ఉపాధి కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. అటవీ ఉత్పత్తులు సేకరించే గిరిజనులకు జీసీసీ ద్వారా ప్రత్యేక మద్దతు ధర కల్పించి అటవీ ఉత్పత్తుల సేకరణను ప్రోత్సహించాలని కోరుతున్నారు.