Farmers | సుల్తానాబాద్ రూరల్, మే 14 : పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని మమతా రైస్ మిల్లు నిర్వహకులు వరి ధాన్యం దింపుకోవడం లేదంటూ ఎలిగేడు మండలం రావులపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ట్రాక్టర్లను రహదారిపై పెట్టి బైఠాయించారు.
వరి ధాన్యం దింపుకునేనంతవరకు కదిలేది లేదంటూ మండుటెండలో భీష్మించుకుని కూర్చున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్, సివిల్ సప్లై డిటి మహేష్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. బుధవారం సాయంత్రం మిల్లుకు తీసుకువచ్చిన ట్రాక్టర్ల ధాన్యం ఇప్పటివరకు కూడా రైస్ మిల్లు నిర్వహకులు దింపుకోలేదని వారి ఆవేదనను వివరించారు. దీంతో అధికారులు రైస్ మిల్లు నిర్వాహకులతో మాట్లాడి దింపుకునే విధంగా చర్యలు చేపట్టారు.
రైస్ మిల్లు నిర్వాహకులు దింపుకుంటామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో రావులపల్లి సర్పంచ్ సిద్ధి తిరుపతి, జంగయ్య, పరుశరాములు, రమేష్, అంజయ్య, శేఖర్, మహేష్, నరేష్, సమ్మయ్య, నాగరాజు, రవీందర్లతోపాటు తదితరులున్నారు.
