Menopause : గృహహింస (Domestick violence) కు, రుతుక్రమం (Menopause) ఆగిపోయే సమయానికి మధ్య సంబంధం ఉన్నది తాజా అధ్యయనం (New Study) లో వెల్లడైంది. ఇళ్లలో వేధింపులను ఎదుర్కొంటున్న మహిళల్లో మెనోపాజ్ (రుతుక్రమం) ముందుగానే ఆగిపోతుందని స్పెయిన్ (Spain) లోని గ్రెనడా విశ్వవిద్యాలయ (Grenada University) పరిశోధకుల అధ్యయనంలో తేలింది. సాధారణ మహిళలతో పోలిస్తే వేదింపులకు గురయ్యే మహిళల్లో 20 నెలల ముందే మెనోపాజ్ ఆగిపోయే అవకాశం ఉందని వెల్లడైంది.
తాజా అధ్యయనం ప్రకారం.. వేధింపులను ఎదుర్కొనే మహిళల్లో దుష్ప్రభావాలు నడి వయసు వరకు కొనసాగుతాయి. అకస్మాత్తుగా ముఖం, మెడ భాగాల్లో విపరీతమైన వేడి ఆవిర్లు రావడం, నిద్రలేమి, మానసిక ఆందోళన, నిరాశ, కుంగుబాటు, లైంగిక, మూత్రకోశ సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. మెనోపాజ్ తర్వాత శారీరకంగా, మానసికంగా, లైంగికంగా జీవన నాణ్యత తగ్గుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా శరీరంలో హార్మోన్లను నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది.
ఫలితంగా జన్యువుల పనితీరులో మార్పులు వస్తాయి. వేధింపులవల్ల మనో వ్యధకు గురైన మహిళలకు అకాల అండాశయ వైఫల్య ప్రమాదం కూడా పొంచి ఉందని అధ్యయనం తేల్చింది. గృహహింస, వేధింపులు అనేవి కీలక ప్రజారోగ్య సమస్య, దీని ప్రభావాలు హింసకు గురైన దశాబ్దాల తర్వాత కూడా కొనసాగుతాయి. ఇలాంటి రుగ్మతలను ఎదుర్కొంటున్న మహిళల సమస్యలను గోప్యంగా ఉంచడం, లైంగిక అంటువ్యాధులు, గర్భాశయ క్యాన్సర్ కోసం ముందస్తు స్క్రీనింగ్ నిర్వహించడం వంటి చర్యలు అవసరమని పరిశోధకులు సూచించారు.