జగిత్యాల : వచ్చే విద్యా సంవత్సరం ( 2026-27 ) నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పాహారం( Breakfast ) కూడా అందించనున్నట్లు జిల్లా విద్యాధికారి కె. రాము ( DEO Ramu ) తెలిపారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యతో పాటు సమగ్ర అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చారని, 3 వేల మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం విశేషమని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 9 వస్తువులతో కూడిన కిట్‌ను విద్యార్థులకు అందజేయనున్నట్లు చెప్పారు.
జిల్లాలో కొత్తగా 78 ప్రీ-ప్రైమరీ పాఠశాలలు, 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని వివరించారు. ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి ఆర్థిక భారం మోసే బదులు, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి చంద్రకళ, పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు బోయినిపెల్లి ఆనంద్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.