Bhumi Pednekar | బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. శ్రావణ మాసం ప్రారంభమైన సందర్భంగా శివాలయానికి వెళ్లిన ఆమె శివలింగానికి అభిషేకం చేస్తూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అయితే భక్తి కంటే ఆమె ధరించిన సన్గ్లాసెస్నే ఎక్కువగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. గుడిలో పూజలు చేస్తున్న సమయంలో కూడా కళ్లజోడు తొలగించకపోవడంతో సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూమి పెడ్నేకర్ బ్లాక్ టాప్, బ్లూ జీన్స్ ధరించి, కళ్లకు బ్లాక్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని శివాలయంలో పూజలు చేశారు. శివలింగానికి జలాభిషేకం చేసి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఆమె భావోద్వేగ క్యాప్షన్ కూడా జోడించారు.
శ్రావణ మాసం ప్రారంభమైన ఈ పవిత్ర సమయంలో నా జీవితం సులభంగా మారాలని నేను కోరుకోవడం లేదు. ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం, శక్తిని ప్రసాదించమని మహాదేవుడిని ప్రార్థిస్తున్నాను. హర్ హర్ మహాదేవ్ అంటూ ఆమె పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భూమిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దేవాలయంలోకి వెళ్లేటప్పుడు కనీసం సన్‌గ్లాసెస్ తీసేయాలనే ఆలోచన కూడా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. దేవుడి ముందు భక్తి చూపుతున్నారా.. లేక ఫొటోషూట్ చేస్తున్నారా?”, “గుడిలో కూడా సన్‌గ్లాసెస్ పెట్టుకుని పూజలు చేయడం ఏంటి?”, “సంప్రదాయాలకు కనీస గౌరవం ఇవ్వాలి” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు కొందరు మాత్రం ఈ విషయాన్ని అనవసరంగా పెద్దది చేయొద్దని అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత దుస్తులు లేదా స్టైల్ ఆధారంగా భక్తిని అంచనా వేయడం సరైంది కాదని, అసలు ఉద్దేశం భక్తితో ప్రార్థించడం కావచ్చని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వివాదంపై భూమి పెడ్నేకర్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇటీవల అస్సాంలో సంభవించిన వరదల నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చిన భూమి పెడ్నేకర్, సహాయక చర్యలకు విరాళాలు అందించాలని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశారు. ఆమె చొరవను అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అభినందించింది.