హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : మకా మదీనా అల్లాదిన్ వక్ఫ్, అల్లాదిన్ చారిటీస్ అండ్ జకాత్ వక్ఫ్, అల్లాదిన్ చారిటీస్ వక్ఫ్, అల్లాదిన్ ఎడ్యుకేషనల్ ఎండోమెంట్ ట్రస్టులకు చెందిన 452 ఆస్తులపై వచ్చే అద్దెలు, ఇతర ఆదాయాన్ని జమ చేసేందుకు ఎస్రో ఖాతా తెరవాలని హైకోర్టు రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శిని ఆదేశించింది. ఆ ట్రస్టుల ఆదాయాన్ని ఎస్క్రో ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. 2012లో జారీచేసిన ఉత్తర్వుల ద్వారా తమ ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధిలో కొనసాగించడాన్ని సవాలు చేస్తూ మకా మదీనా అల్లాదిన్ వక్ఫ్, ఇతర ట్రస్టులు హైకోర్టును ఆశ్రయించాయి.
ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. 2012 జనవరి 17 నుంచి ట్రస్టు ఆస్తుల నిర్వహణ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగుతున్నదని, వాటిపై వస్తున్న అద్దెలు, ఇతర ఆదాయాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 2025 ఏప్రిల్ 8 నుంచి వక్ఫ్ చట్టసవరణ అమల్లోకి వచ్చినందున ట్రస్టులకు చెందిన ఆస్తులు ఆ చట్టం పరిధిలోకి రావని తెలిపారు. అందువల్ల ఆ ఆస్తులను వక్ఫ్ బోర్డు పరిధి నుంచి విడుదల చేయాల్సి ఉన్నదని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని మైనారిటీ సంక్షేమ శాఖతోపాటు వక్ఫ్ బోర్డును ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.