Nandini Reddy | తెలుగు సినీ పరిశ్రమలో తక్కువ సినిమాలతోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకురాలు నందిని రెడ్డి ఇప్పుడు తన కెరీర్‌ను మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. కుటుంబ కథా చిత్రాలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఇటీవల సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా సాధించిన ఘన విజయంతో నందిని రెడ్డి క్రేజ్ మరింత పెరిగింది.సమంత, నందిని రెడ్డి కాంబినేషన్‌కు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆదరణ ఉంది. గతంలో కూడా ఈ ఇద్దరూ కలిసి పలు విజయవంతమైన చిత్రాలు అందించగా, తాజాగా వచ్చిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సక్సెస్ తర్వాత నందిని రెడ్డి తదుపరి ప్రాజెక్టులపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నందిని రెడ్డి తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను రెండేళ్ల పాటు ఢిల్లీలో చదువుకున్నానని, ఆ సమయంలో హిందీ సినిమాలను క్రమం తప్పకుండా చూసేదాన్నని చెప్పారు. మంచి కథ దొరికితే తప్పకుండా హిందీలో సినిమా చేయాలని తనకు చాలా కాలంగా కోరిక ఉందని వెల్లడించారు. అంతేకాకుండా, త్వరలోనే ఒక డార్క్ సూపర్‌నేచురల్ వెబ్ సిరీస్‌ను ప్రారంభించబోతున్నట్లు కూడా ఆమె ప్రకటించారు. అక్టోబర్ నెలలో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువగా లైట్ హార్టెడ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలనే తెరకెక్కించిన తాను, ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్లో ప్రేక్షకులను అలరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
ఇన్నాళ్లు ఒకే తరహా కథలు చేశాను. ఇప్పుడు కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని అనిపిస్తోంది. ముందుగా వెబ్ సిరీస్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత నా తదుపరి సినిమా గురించి ఆలోచిస్తాను అని నందిని రెడ్డి పేర్కొన్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు ఇప్పటికే బాలీవుడ్లో దర్శకుడు, నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించారు. వెబ్ సిరీస్‌లు, సినిమాలతో హిందీ ప్రేక్షకులకు దగ్గరైన రాజ్‌తో నందిని రెడ్డికి కూడా మంచి అనుబంధం ఉంది. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమాకు వీరిద్దరూ కలిసి పనిచేయడం మరింత చర్చనీయాంశమైంది. దీంతో భవిష్యత్తులో నందిని రెడ్డి బాలీవుడ్లో సినిమా చేయాలనుకుంటే, రాజ్ నిడిమోరు సహకారం ఆమెకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.