Kajal Aggarwal | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఒకవైపు మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేస్తూనే, మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలను పోషిస్తూ బిజీగా ఉంది. ఇటీవల కమల్ హాసన్‌తో ఇండియన్ 3 లో కనిపించిన కాజల్, ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో మరోసారి జతకట్టనుంది. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్, ఇప్పుడు బాలయ్య కెరీర్లో 111వ చిత్రంగా తెరకెక్కుతున్న NBK111లో మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆమె ఫస్ట్ లుక్‌ను ఇటీవల చిత్ర బృందం విడుదల చేయగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది.
కొద్ది రోజులుగా ఈ సినిమాలో కాజల్ పాత్రపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఆమె ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారిణి పాత్రలో నటిస్తోందని, కథలో అత్యంత కీలకమైన పాత్ర ఆమెదేనని ప్రచారం జరుగుతోంది. యాక్షన్, ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో సాగే ఈ పాత్ర సినిమా కథను కీలక మలుపులు తిప్పుతుందని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ అగర్వాల్ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో నా పాత్ర ఫన్నీగా ఉండదు. చాలా సీరియస్‌గా ఉంటుంది అని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటివరకు వినిపిస్తున్న ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఆమె వ్యాఖ్యలతో ఈ సినిమాలో కాజల్ పూర్తిగా కొత్త షేడ్‌లో కనిపించబోతున్నట్లు అర్థమవుతోంది. గతంలో గ్లామర్, రొమాంటిక్ పాత్రల్లో ఎక్కువగా కనిపించిన కాజల్, ఈసారి ఇంటెన్స్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
కాజల్ చేసిన వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమాలో బాలకృష్ణ, కాజల్ పాత్రల మధ్య బలమైన సంఘర్షణ ఉండే అవకాశముందని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఆమె నిజంగానే క్రైమ్ బ్రాంచ్ అధికారిణి పాత్రలో నటిస్తే, కథలో బాలయ్యతో ఆమెకు సంబంధించిన సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే చిత్ర బృందం ఇప్పటివరకు ఆమె పాత్రపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అందువల్ల పూర్తి క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK111పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణను మరో పవర్ఫుల్ అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు సిద్ధమవుతున్నట్లు సమాచారం.