Current Shock | పెగడపల్లి : విద్యుత్ షాక్తో యువ రైతు దుర్మరణం చెందిన ఘటన జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. నంచర్ల గ్రామానికి చెందిన ఎడ్ల రాజేంద్రరెడ్డి 42 అనే యువరైతు గ్రామ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సిబ్బంది, గ్రామ రైతులతో కలిసి మరమ్మత్తు పనులు చేపడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి దుర్మరణం చెందినట్టు స్థానికులు పేర్కొన్నారు.
కాగా తన భర్తను కొందరు గ్రామ రైతులు ఇంటి వద్ద నుండి బలవంతంగా ట్రాన్స్ఫార్మర్ వద్దకు తీసుకెళ్లారని భార్య విజయ ఆరోపించారు. అక్కడ విద్యుత్ సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేశామని తెలపడంతో తన భర్త ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కడంతో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు ఆరోపించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పెగడపల్లి ట్రైనీఎస్సై రవీందర్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.