న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: నిన్నమొన్నటిదాకా తగ్గుతూపోయిన బంగారం ధరలు.. ఇప్పుడు పెరుగుతూపోతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం మండిపోతున్నది. ఇది క్రూడాయిల్ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఇదే ఇప్పుడు మదుపరులను కలవరపెడుతున్నది. అంతర్జాతీయ విపణిలో విజృంభించే ముడి చమురు ధరలు.. గ్లోబల్ స్టాక్ మార్కెట్లను కూలదోయడం ఖాయమే మరి. అందుకే మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం.. తిరిగి గోల్డ్ వైపు చూస్తున్నారు. ఈ పరిణామం పసిడి రేట్లను మరొక్కసారి పరుగులు పెట్టిస్తున్నది.
ఇదీ సంగతి..
ఇరాన్ సైనిక, అణు సామర్థ్య బలోపేతంపై గుర్రుగా ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌లు.. ఆ దేశంపై సంయుక్తంగా విరుచుకుపడుతున్నాయి. దీనికి ఇరాన్ సైతం దీటుగా బదులిస్తుండటంతో.. పశ్చిమాసియా భగ్గుమంటున్నది. కాగా, పెట్రోలియం ఎగుమతి దేశాల సంఘం (ఒపెక్)లో ఇరాన్ మూడో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్నది. రోజుకు దాదాపు 3.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తితో ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 4.5 శాతం వాటాను కలిగి ఉన్నది. ఇక అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం.. హార్మూజ్ జలసంధి మీదుగా జరిగే రవాణాపై తీవ్ర ప్రభావాన్నే చూపనున్నది. ఈ మార్గం ద్వారానే ప్రపంచ గ్యాస్ సరఫరాలో 20 శాతం, ముడి చమురు సరఫరాలో 25 శాతం రవాణా అవుతున్నది. యుద్ధం నేపథ్యంలో ఈ మార్గం మూతబడితే రవాణాకు అంతరాయమే. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు తొడుగుతాయి. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసి.. భారత్ సహా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్ల పెంపునకు కారణమవుతుంది. రుణ లభ్యత పడిపోయి ఆయా రంగాలు కుంటుబడుతాయి. చివరకు దేశ వృద్ధిరేటు పతనమవుతుంది. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటాయి. ఈ భయాలతోనే ఇన్వెస్టర్లు భారీగా గోల్డ్‌పై పెట్టుబడులకు దిగుతున్నారు. సిల్వర్పైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ధరలు పరుగులు పెడుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఫ్యూచర్ మార్కెట్లలో..
స్పాట్ మార్కెట్‌తోపాటు దేశ, విదేశీ ఫ్యూచర్ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు దౌడు తీస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)లో తులం 24 క్యారెట్ బంగారం మరోసారి రూ.1.70 లక్షలు పలికింది. కిలో వెండి ధర కూడా రూ.3 లక్షల్ని తాకింది. ఇక అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెటైన కొమెక్స్లో ఔన్స్ గోల్డ్ వ్యాల్యూ 5,296 డాలర్లకు చేరింది. సిల్వర్ 93.82 డాలర్లుగా ట్రేడైంది. రిటైలర్లతోపాటు సెంట్రల్ బ్యాంకులూ గోల్డ్, సిల్వర్‌ను నిల్వ చేసేందుకు పోటీపడుతున్నాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్‌పై నమ్మకం కొరవడుతుండటంతో తమ దేశ ఆర్థిక వ్యవస్థల రక్షణార్థం.. సెంట్రల్ బ్యాంకులు బంగారం, వెండి నిల్వల్ని పెంచుకుంటున్నాయి.
తులం ధర రూ.6,550 జంప్
హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి ధర రూ.6,550 ఎగిసి రూ.1,54,650 పలికింది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి తులం రేటు రూ.7,140 అందుకుని రూ.1,68,710గా నమోదైంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగితే ఈ వారం రోజుల్లో గత ఆల్‌టైమ్ హై రికార్డులను అధిగమించి ధరలు పరుగులు పెట్టడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 29న భారతీయ మార్కెట్లో తులం 24 క్యారెట్ బంగారం ధర మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000 పలికిన విషయం తెలిసిందే. కిలో వెండి ధర కూడా ఆల్‌టైమ్ హై రికార్డుకెక్కి రూ.4,04,500గా నమోదైంది. ఇక జనవరి 30న బంగారం రేటు రూ.14,000 ఎగబాకితే.. 31న వెండి ధర ఏకంగా రూ.72,500 ఎగిసింది.