చందంపేట, ఆగస్టు 05 : నల్లగొండ జిల్లా చందంపేట మండలం పోల్య నాయక్ తండాకు చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామావత్ గూగాని (70) ఈరోజు ఉదయం పెన్షన్ తీసుకునేందుకు మూడుదండ్ల గ్రామానికి వెళ్లగా, అక్కడ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కుప్పకూలి మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తండాలోనే పెన్షన్ పంపిణీ చేయాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందన లేకపోవడంతో వృద్ధులు సమీప గ్రామం మూడుదండ్ల వెళ్లాల్సి వస్తోందన్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఓ వృద్ధురాలి ప్రాణాన్ని బలితీసుకుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, పోస్ట్మ్యాన్పై కూడా గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. దూర ప్రాంతాలకు హైదరాబాద్ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బంది, పోల్య నాయక్ తండా నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి మాత్రం రావడం లేదని వారు ఆరోపించారు.
అలాగే పలువురి లబ్ధిదారుల నుండి కమీషన్ తీసుకున్న తర్వాతే పెన్షన్ అందిస్తున్నారనే గ్రామస్తులు ఆరోపించారు. అలాగే, పెన్షన్ పంపిణీ సమయంలో ప్రభుత్వం అందించే అదనపు రూ.16 మొత్తాన్ని కూడా లబ్ధిదారుల నుంచి తీసుకుంటున్నారని, ప్రశ్నించిన వారికి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి నెలల తరబడి తిప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం, పోస్టల్ శాఖ విచారణ జరిపించి బాధ్యులపై ఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.