Special Trains : దసరా పండుగ దగ్గరపడుతుండటంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీని నివారించేందుకు చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా చర్లపల్లి-నాగర్‌కోయిల్ మార్గంలోనూ 10 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య నడిచే 16 ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ఈ విధంగా ఉన్నది. రైలు నంబర్ 07037 (చర్లపల్లి-శ్రీకాకుళం) అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతోపాటు నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో నడవనుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07038 (శ్రీకాకుళం-చర్లపల్లి) అక్టోబర్ 7, 14, 21, 28 తేదీల్లో, నవంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, సింహాచలం, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతాయి.
వీటితోపాటు చర్లపల్లి-నాగర్‌కోయిల్ మార్గంలోనూ 10 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు నంబర్ 07535 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 23 వరకు ప్రతి శుక్రవారం, రైలు నంబర్ 07536 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రతి ఆదివారం నడవనున్నాయి. పండుగ సీజన్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.