MLA Sanjay Kalvakuntla | కోరుట్ల, డిసెంబర్ 9 : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిందని, గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు దయనీయస్థితిలో పడిపోయాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లుగా పాలన పడకేసిందని, పచ్చదనం, పరిశుభ్రత కోసం గ్రామ పంచాయతీలకు అందజేసిన ట్రాక్టర్లకు డీజిల్ పోసేందుకు కూడా నిధులు ఇవ్వని దీనస్థితికి చేరుకున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రతీ యేటా గ్రామ పంచాయతీలకు నిధులు అందించి కులవృత్తులకు ప్రోత్సాహం అందించారని తెలిపారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కులవృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని.. మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ అటకెక్కిందని, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని, రైతు బంధు డబ్బులు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదన్నారు. అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిందన్నారు. యాసంగికి పంట పెట్టుబడికి డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్న పట్టించుకునే నాథుడే లేడన్నారు. రైతులు అష్టకష్టాలు పడుతున్నా ప్రభుత్వ పెద్దలు కనీసం స్పందించిన దాఖలాలు లేవని ఆరోపించారు. సన్నాలకు బోనస్ అందించేందుకు రూ. 300 కోట్లు విడుదల చేశామని చెప్పిన ప్రభుత్వం రైతులకు ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
ఎకరం మక్క పంటకు ఆరు బస్తాల యూరియా అవసరం పడుతుందని, కానీ ప్రభుత్వం రెండు బస్తాల యూరియాను మాత్రమే అందించేందుకు రైతుల పాస్ బుక్, ఆధార్ కార్డు సంధానం చేస్తూ ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తేనే ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని, ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు ఇవ్వమని, పింఛన్లు నిలిపివేస్తామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.
ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన పాలకులు ఇలాంటి చవక బారు చర్యలకు దిగడం బాధాకరమన్నారు. తొలిరోజు గ్లోబల్ సమ్మిట్లో కుదుర్చుకున్నట్లు పత్రికా ప్రకటనలు జారీ చేసిన ప్రభుత్వం.. ఒక పత్రికలో రెండు లక్షల కోట్లుగా, మరో పత్రికలో 3.97 లక్షల కోట్లుగా భిన్న కథనాలు ప్రచారం చేసుకోవడం విస్మయం కలిగించిందన్నారు. ఇలాంటి చౌకబారు ప్రకటనలతో మీడియా రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారని విమర్శించారు.
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు మెజార్టీ స్థానాలు కైవసం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేష్, ఫహీం, అతిక్, అన్వర్, వినోద్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.