Vijay Diwas | నిజామాబాద్, డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో కేసీఆర్ సంతకం చెరిపేస్తే చెరిగిపోయేది కాదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిసెంబర్ 9వ తేదీ విజయ్ దివస్‌ను మంగళవారం నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’, నేను చస్తే శవయాత్ర, తెలంగాణ వస్తే జైత్రయాత్ర అన్న నినాదంతో నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఆనాటి కేసీఆర్ దీక్ష ఢిల్లీ పీఠాలనే కదిలించి డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన చేశారని ఆయన పేర్కొంటూ 2014 జూన్ 2 తెలంగాణ స్వరాష్ట్ర అవతరణ తో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైందన్నారు.
కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదని, ఆ ప్రకటనే లేకుంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ ఏటా నవంబర్ 29వ తేదీన దీక్షాదివస్, డిసెంబర్ 9వ తేదీన విజయ్ దివస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, ఆశలు ఫలించిన సుదినంగా జీవన్ రెడ్డి అభివర్ణించారు.
ఉద్యమాన్ని రగిలించి ఆమరణ నిరాహారదీక్ష..
తెలంగాణ ప్రజల్లో ఉన్న పౌరుషాన్ని మండించటంలో కేసీఆర్ అగ్గిమంటై నిలిచారన్నారు. తెలంగాణ మహోన్నత సంకల్పాన్ని గాంధేయ మార్గంలో రాజకీయ ప్రక్రియగా మలిచి దాన్ని లక్షలాది ప్రజల సింహగర్జనగా, జనఘోషగా కేసీఆర్ మార్చగలిగారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అన్నికోణాల నుంచి ఉద్యమాన్ని రగిలించి ఆమరణ నిరాహారదీక్షకు దిగారన్నారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజులు కేసీఆర్ చేసిన ఆమరణ దీక్ష మొత్తం తెలంగాణ సమాజాన్ని కదిలించిందన్నారు.
నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్షను అడ్డుకుని అరెస్టు చేయటంతో తెలంగాణ అట్టుడికిపోయిందని, కేసీఆర్ తన మాటల్ని తూటాలుగా మార్చారని, ప్రజా ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమ ప్రక్రియగా మలిచారని ఆయన కొనియాడారు. అమరుల త్యాగాలతో తెలంగాణ తల్లడిల్లుతుంటే కేసీఆర్ తన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రం కళ్లు తెరిపించారన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభం అన్న ప్రకటన తెప్పించగలిగిన ధీశాలి, శక్తిమంతుడు కేసీఆర్ అని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలంతా ఏదైతే కోరుకున్నారో దాన్ని సాధించిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయారన్నారు.
Director Sandeep Raj | నేనే దురదృష్టవంతుడిని.. ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ ఎమోషనల్ పోస్ట్!
Actor Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్రభాస్‌కి తప్పిన ప్రమాదం
V. Shantaram Biopic | వి. శాంతారామ్ బయోపిక్‌లో హీరోయిన్గా తమన్నా.. ఫస్ట్ లుక్ రిలీజ్