అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడు ( Telugunadu ) గా మార్చాలని ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు( Garikapati Narasimha Rao) చేసిన వ్యాఖ్యలపై ఏపీలో దుమారం రేపుతుంది . అయితే గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ( Kamalanda Bharati ) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ను తెలుగునాడుగా మార్చితే తెలుగు ప్రజల బతుకులు మారుతాయని, ఎన్టీఆర్ తెలుగునాడు కోసం అనేక ప్రయత్నాలు చేశారని గరికపాటి అన్నారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనకు లేదని, కేరళను కేరళంగా మార్చాలని పట్టుబట్టి మార్చుకున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగుదనం లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది తెలుగు పదం కాదు. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్గానే ఆంధ్రప్రదేశ్ అంతేనని వెల్లడించారు. కేరళను కేరళంగా మార్చినట్టే ఏపీని తెలుగునాడుగా మార్చాలని ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడారు.
అయితే గరికపాటి వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి (Kamalananda Bharathi ) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం లేదని, తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలగానే ఉంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల విశ్వాసాలు, నమ్మకాలు, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం విచారకరమన్నారు.
నాడు అనే పదం తమిళం కాదా.. ఆంధ్రప్రదేశ్ అని పేరు ఉంటే నష్టం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఆంధ్ర, ప్రదేశ్ రెండు సంస్కృత పదాలే అంటూ వివరణ ఇచ్చారు. అడిగేవారు లేరని అధిక ప్రసంగాలు చేస్తున్నారని, వింత పోకడలు, వింత ఆలోచనలు మంచిదికాదంటూ హితబోధ చేశారు. ‘ రామాయణ కాలం నుంచి ఆంధ్రా పేరు ఉంది. తెలుగునాడు అని మార్చినా సెంటిమెంట్ ఏమీ రాదు. ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని ఎత్తుకున్నారు. కానీ పార్టీ పేరు మాత్రం తెలుగుదేశం అని పెట్టారు. ఇలాంటి మేధావులు ఏపీకి మద్రాస్ రాకుండా చేశారని గరికపాటిపై మండిపడ్డారు.
మా ప్రాంతం, మా బతుకులు ఎలా ఉండాలో మాకు తెలుసు. గరికపాటి ఆంధ్రాకు రారు.. తెలంగాణలో సెటిలయ్యారు.. ఎక్కడో ఉండే గరికపాటి ఇక్కడికి వచ్చి సలహాలు ఇవ్వొద్దు. మేం ఆంధ్రప్రదేశ్ ప్రజలగానే ఉంటామని కమలానంద భారతి అన్నారు .