ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉందని అన్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ అన్న ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారని హరీశ్‌రావు అన్నారు. ఆయన మన మధ్య లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా నాకు ఒక ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయిన బాధ ఇది అని అన్నారు.
పెద్ది సుదర్శన్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని హరీశ్‌రావు తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరారు. పెద్ది అన్నకు జోహార్లు తెలిపారు.