హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని గ్రామపంచాయతీ లేఅవుట్లలో ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్ల క్రయవిక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించి మరో రియల్ ఎస్టేట్ సంక్షోభానికి తెరలేపింది. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఒక్క ప్లాట్ కూడా అమ్ముకొనే పరిస్థితి లే కుండాపోయింది. జీపీ లేఅవుట్ల ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇచ్చి.. ఇప్పుడు గడువు ముగిసిందంటూ వాటిపై నిషేధం విధించి లక్షలాది ప్లాట్లకు భవిష్యత్తు లేకుండా చేసింది. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వీర్యం చేసే లక్ష్యంతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ తీరు.. మరో ప్రజా ఉద్యమానికి ఆజ్యం పోస్తున్నదని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ మండిపడింది.
జీపీ లేఅవుట్ ప్లాట్లపై నిషేధించడం చట్ట విరుద్ధమనే కనీస పరిజ్ఞానం సీఎం రేవంత్‌రెడ్డికి, సంబంధిత శాఖ మంత్రికి లేకపోవ డం సిగ్గుచేటని విమర్శించింది. కాంగ్రెస్ సర్కార్ జీపీ లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం వల్ల వేలాదిమంది రియల్టర్లు, కొనుగోలుదారులు తీవ్ర ఇ బ్బందులు ఎదురొంటున్నారు. అప్పట్లో రియల్టర్ల ఆందోళనలతో 10శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయిన లేఅవుట్లకు ఎల్ఆర్ఎస్ కింద రుసుము చెల్లిస్తే మిగతా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. కానీ అప్పటినుంచి రియల్ ఎస్టేట్ మందగమనం వల్ల అనేక లేఅవుట్లలో వేలాది ప్లాట్లు అమ్ముడుపోకుండా మిగిలి ఉన్నాయి. వీటి క్రయవిక్రయాలను నిషేధిస్తూ ఇటీవ ల కాంగ్రెస్ ప్రభుత్వం మెమో నం.5509 plg/111/ 2025 (తేదీ: 06/07/ 2026), జీవో 28 ద్వారా ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించింది.
యాదాద్రి భువనగిరి, వరంగల్, ఖమ్మం, జనగామ, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి తదితర జిల్లాల్లో వేలాది గ్రామపంచాయతీ లేఅవుట్లలో ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లు వేల సంఖ్యలో ఉన్నాయి. గతంలో గ్రామ పంచాయతీల్లోని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ను ఆపడం చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చే స్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం, ఇప్పుడు ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను ఆపేయడంతో 26 లక్షల మంది దరఖాస్తుదారులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటివరకు ఎల్ఆర్ఎస్ చెల్లించని ప్లాట్లపై విధించిన నిషేధాన్ని తొలగించి, నిర్ణీత గడువు లేకుండా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది.
అప్పుడున్న అవసరాలు, అనుమతుల విధానాలకు అనుగుణంగా జీపీ లేఅవుట్లను ఎంతోమంది వ్యాపారులు నిర్మించారు. వీటిని లక్షలాది మంది సామాన్యులు కొనుగోలు చేశారు. ఇప్పుడు వాటిపై ఎలాంటి హక్కు లేకుండా చేయడం వెనుక రియల్ ఎస్టేట్ రంగాన్ని చావుదెబ్బ కొట్టడమే అవుతుంది. ఎల్ఆర్ఎస్ చెల్లించే అవకాశం లేకుండా చేసి, క్రయవిక్రయాలకు తావు లేకుండా చేసి ఆ ప్లాట్లపై ఏం చేయాలని చూస్తుందనేది అంతుచిక్కని అంశంగా మారింది. అవసరమైతే ఆ ప్లాట్లను కాంగ్రెస్ నేతలకు రాసిచ్చే పరిస్థితులు వచ్చాయి. సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే, పేదల పొట్ట కొట్టే ఇలాంటి అనాలోచిత, అవగాహన లేని నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలి.
బెజ్జంకి, సెప్టెంబర్ 15 : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన రైతు కొరివి రాజ్‌కుమార్ (34) అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రాజ్‌కుమార్ తనకున్న 30 గుంటల్లో వరి సాగు చేశాడు. పంట నష్టంతోపాటు ఇటీవల పాడి పశువులు చనిపోగా రూ.5 లక్షల వరకు అప్పు అయింది. దీంతో మనస్తాపానికి గురైన రాజ్‌కుమార్ మంగళవారం గ్రామ శివారులో పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బెజ్జంకి పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.