తెలంగాణలో పోలీస్ శాఖ అధికార కాంగ్రెస్‌కు అనుబంధ విభాగంలా, సాధారణ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నది. స్టేషన్ లోపల ఇంతటి ప్రాణాంతక దాడి జరిగినా కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం పోలీసుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. గూండాలు పోలీస్ స్టేషన్లలోకి చొరబడి దాడులకు తెగబడినా పోలీసులు వారికి రక్షణగా నిలుస్తూ బాధితుల వాదనను వినకపోవడం సిగ్గుచేటు.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సాధకుడు, రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నేత నివాసంపై దాడి మొదలుకొని.. రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్ గదుల్లోనే ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత సహాయకులపై ముసుగులతో సామూహిక దాడి వరకు తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమయ్యాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని, పోలీసు యంత్రాంగం పక్షపాత పోకడలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రత్యర్థులపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతూ, ఖాకీల సమక్షంలోనే మూకదాడులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ నివాసంపై జరిగిన దాడిని అడ్డుకునేందుకు తాము అకడికి చేరుకుంటే, నిరసనకారులను నిలువరించాల్సిన పోలీసులు తమనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారని కేటీఆర్ గుర్తుచేశారు. రక్షణ కల్పించాల్సిన స్టేషన్ ప్రాంగణంలోనే తమపై కూడా దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే గొంతులను అణచివేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, శాంతిభద్రతల పరిరక్షణను గాలికొదిలేసి ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురిచేయడమే ఎజెండాగా పెట్టుకున్నదని దుయ్యబట్టారు.
తాజాగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్‌రెడ్డిపై జరిగిన దాడి అత్యంత దుర్మార్గమైన పరిణామమని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణ పేరుతో వారిని ఉదయం 10 గంటలకే స్టేషన్‌కు పిలిపించి, హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కావాలనే రాత్రి వరకు కూర్చోబెట్టి, దాదాపు 15 మందితో పోలీస్‌స్టేషన్ ఇంటరాగేషన్ గదిలోనే పథకం ప్రకారం మూకుమ్మడి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. స్టేషన్ లోపలే మాసులు ధరించిన దుండగులు చొరబడి దాడులు చేస్తుంటే అసలు చట్టబద్ధ పాలన ఎకడుందని నిలదీశారు.
నిన్న పోలీస్ స్టేషన్లో తన సిబ్బందిపై విరుచుకుపడింది కాంగ్రెస్ గూండాలా.. లేక మఫ్టీలో ఉన్న పోలీసులా? అనేది తక్షణమే తేలాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ పెద్దల ఆదేశాలతో పోలీసులే మఫ్టీ దుస్తుల్లో ఈ అకృత్యానికి పాల్పడ్డారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. స్టేషన్ లోపల, వెలుపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను బయటపెట్టి, సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి దాడి వెనుక ఉన్న సూత్రధారులను సమాజం ముందు నిలబెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పోలీస్ శాఖ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుబంధ విభాగంలా, సాధారణ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. స్టేషన్ లోపల ప్రాణాంతక దాడి జరిగినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం పోలీసుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా ఐదు గంటల పాటు స్టేషన్లో నిరీక్షించి, జీరో ఎఫ్ఐఆర్ అయినా నమోదు చేయాలని లిఖితపూర్వకంగా కోరినా పట్టించుకోలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కనీస ఫిర్యాదును కూడా స్వీకరించలేని దుస్థితిలో రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కొట్టుమిట్టాడుతున్నదని, బాధితులకు అండగా ఉండాల్సిన రక్షకభటులే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులకు కొమ్ముకాస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ సరార్ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి పరిష్కారంలో పూర్తిగా విఫలమై తీవ్ర నిరాశానిసృ్పహల్లో కూరుకుపోయిందని కేటీఆర్ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, పాలనా వైఫల్యాలపై ప్రతిపక్షం అడుగుతున్న సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు (అటెన్షన్ డైవర్షన్) ప్రతిరోజూ ఇలాంటి కుట్రలు, దాడులకు తెరలేపుతున్నదని ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల తర్వాత తాము సంధిస్తున్న నిలదీతలను తట్టుకోలేకనే భౌతిక దాడులను ఆయుధంగా మార్చుకున్నారని మండిపడ్డారు.
పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ చేతుల్లో కీలుబొమ్మగా మారిన నేపథ్యంలో, తమపై జరిగిన అ మానుష దాడిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని కేటీఆర్ స్పష్టంచేశారు. పోలీసులు కనీస ఎఫ్ఐఆర్ నమోదు చేయని పరిస్థితుల్లో కోర్టుల ద్వారానే తమ కు పూర్తి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉన్నదని పేరొన్నారు. న్యాయవ్యవస్థ ద్వారా అసలు దో షులను బోనులో నిలబెడుతామని హెచ్చరించారు.
ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, భౌతిక దాడులతో భయపెట్టాలని చూసినా ప్రజల పక్షాన నిలదీసే తమ పోరాటం ఆగదని కేటీఆర్ తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సాగుతున్న ఈ అరాచక పాలనపై అసెంబ్లీ లోపల, వెలుపల ప్రజలతో కలిసి గళమెత్తుతామని, కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న పోలీస్-గూండారాజ్ దురాగతాలను ప్రజాక్షేత్రంలోనే ప్రజలతో కలిసే తేల్చుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఉద్యమించిన నేత, ప్రజల చేత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ప్రస్తుత శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఇంటిపైనే అధికార పార్టీ శ్రేణులు దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి దుర్మార్గమైన సంసృతి ఎన్నడూ లేదని, ఒక సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి నివాసానికే భద్రత లేకపోతే రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితేందని ప్రశ్నించారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకొని ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం కాంగ్రెస్ అరాచక పాలనకు ప్రత్యక్ష నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు.