నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15 : విద్యుత్తు కోతలపై రైతులు మండిపడుతున్నారు. కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు కొన్ని రోజులుగా చేపడుతున్న ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా చందాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట పలు గ్రామాల రైతులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కర్‌పేట్ సబ్‌స్టేషన్‌ను రైతులు ముట్టడించారు. ఈ సందర్భంగా చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొని ప్రభు త్వ వైఖరిపై మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్త కరెంట్ సరఫరాతో రైతులు ఆగమవుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండ లం తీగలపల్లి, జనుంపల్లి, బావాయిపల్లి గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు తీగలపల్లి సబ్‌స్టేషన్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు.

నారాయణపేట జిల్లా ఊట్కూరు చెక్‌పోస్టు వద్ద ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రోజుకు 12 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేస్తామని గొప్ప లు చెప్పిన ప్రభుత్వం కనీసం 5 గంటలు కూడా నిరంతరాయంగా సరఫరా చేయడంలేదని మండిపడ్డారు. కాగా యూరియా కోసం రైతులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సోమవారం యూరియాను యాప్‌లో బుక్ చేసుకొని మంగళవారం పెనుబల్లి సొసైటీకి వెళ్లగా స్టాక్ అయిపోయిందని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహానికి గురైన రైతులు కార్యాలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎరువుల కోసం నానా ఇబ్బందులు పడాల్సివస్తున్నదని మండిపడ్డారు. స్టాక్ వచ్చిన వెంటనే సమాచారం ఇస్తామని అధికారులు సర్దిచెప్పడంతో రైతులు శాంతించి వెళ్లిపోయారు.