హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ ఆతిథ్యానికి హైదరాబాద్ సిద్ధమైంది. ఆసియా క్రీడల్లో పతకాల మోత మోగించిన భారత స్టార్లతో పాటు పలు దేశాలకు చెందిన 48 మంది మేటి ఆర్చర్లు గురువారం మొదలయ్యే మెగా లీగ్‌లో తమ గురితో అదరగొట్టనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈనెల 18 వరకు జరిగే టోర్నీలో ఆరు జట్లు బరిలో నిలిచాయి. తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. గత సీజన్ ఫైనలిస్టులు రాజ్‌పుతానా రాయల్స్, పృథ్వీరాజ్ యోధాస్ ఆరంభ పోరులో తలపడతాయి. తర్వాతి మ్యాచ్‌ల్లో కాకతీయ నైట్స్-మైటీ మరాఠాస్, చెరో ఆర్చర్స్ -చోళ చీఫ్స్ ఢీకొంటాయి.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ ఆర్చర్ తానిపర్తి చికిత చోళ చీఫ్స్ తరఫున బరిలోకి దిగనుంది. తొలి సీజన్ ఏపీఎల్ అనుభవం ఈ ఆసియాడ్‌లో రెండు స్వర్ణాలు నెగ్గడానికి తనకు ఎంతగానో ఉపయోగపడిందని ఆమె చెప్పింది. ఇప్పుడు సొంత గడ్డపై ఆడుతుండటం ఆనందంగా ఉందని, ఈ పోటీలను చూసి మరింత మంది చిన్నారులు, యువత ఆర్చరీని ఎంచుకోవాలని ఆశించింది. బుధవారం జరిగిన లీగ్ అధికారిక గీతం, మస్కట్ ఆవిష్కరణ కార్యక్రమంలో చికిత పాటు ఆరు ఫ్రాంచైజీ ఆర్చర్లు, లీగ్ డైరెక్టర్ అనిల్ కామినేని పాల్గొన్నారు.