న్యూఢిల్లీ, అక్టోబర్ 7: వైద్యులు, దవాఖానలు ఇకపై రోగులను ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను ఇష్టానుసారంగా వాడుకోలేరు. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) జారీచేసిన కొత్త నిబంధనల ప్రకారం ఇన్స్టాగ్రామ్, ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్, స్పాన్సర్డ్ పోస్టులు, ఏఐ సృష్టించిన ప్రచారాలను కూడా వైద్య ప్రకటనల పరిధిలోకి తీసుకువచ్చాయి. దవాఖానలు/వైద్య సంస్థలు, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్లు పాటించవలసిన నైతిక ప్రకటనలు, ప్రజా సమాచార ప్రసారంపై ఎన్ఎంసీ ఈనెల 6న జారీ చేసిన కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి.
వైద్య సేవలను మార్కెట్ చేయడానికి, రోగుల అభిప్రాయాలు, డబ్బు చెల్లించి రాయించిన లేదా నకిలీ సమీక్షలు, తప్పుదోవ పట్టించే వాదనలు, హామీతో కూడిన చికిత్స ఫలితాలు, రోగుల కథనాలను ఉపయోగించకుండా ఈ నిబంధనలు వైద్యులను నిషేధిస్తున్నాయి. వైద్యులు కేవలం ఆరోగ్య అవగాహన కోసమే కాకుండా, తమ వ్యక్తిగత బ్రాండ్లను నిర్మించుకోవడానికి, రోగులను ఆకర్షించడానికి కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇతర వేదికలను ఎక్కువగా ఉపయోగిస్తున్న తరుణంలో ఎన్ఎంసీ ఈ చర్య తీసుకుంది. ప్రజారోగ్య సమాచారానికి, వాణిజ్య ప్రచారానికి మధ్య ఎన్ఎంసీ ఇప్పుడు మరింత స్పష్టమైన గీతను గీసింది. తమ వాదనలకు రుజువులు చూపగలిగితే తప్ప తమ చికిత్స, సౌకర్యం లేదా నైపుణ్యం ఇతరుల కంటే శ్రేష్ఠమైనవని వైద్యులు చెప్పుకోరాదని వైద్య నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది.