ముంబై, అక్టోబర్ 7 : దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్‌పడింది. అందరూ అంచనావేసినట్టుగానే రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను పెంచడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమనడం మదుపర్లలో సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 429.11 పాయింట్లు కోల్పోయి 72,638.70 పాయింట్ల వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ 173.05 పాయింట్లు కోల్పోయి 22,603 వద్దకు జారుకున్నది. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన ఇంధన ధరలు మళ్లీ 100 డాలర్ల పైకి చేరుకోవడం మదుపర్లను అమ్మకాలవైపు నడిపించాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
దేశీయ కరెన్సీ గింగిరాలు తిరుగుతున్నది. అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో రూపాయి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నది. ఫారెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 40 పైసలు తగ్గి 96.75కి పడిపోయింది.