నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ హామీ ఏమైందని బీఆర్ఎస్ నేతలు నిలదీశారు. దాదాపు మూడేండ్లు కావస్తున్నా కాంగ్రెస్ సర్కార్ ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని మండిపడ్డారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి రాగానే విస్మరించిందని ధ్వజమెత్తారు. గిరిజనులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మాజీ మంత్రులు పలువురు ఆయాచోట్ల మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగట్టారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్‌తో కలిసి దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ గిరిజన నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనులకు పది శాతం నుంచి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని సర్కార్‌ను నిలదీశారు. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. 500 జనాభా ఉన్న తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిని విషయాన్ని గుర్తుచేశారు. గిరిజనులకు లేనిపోని ఆశలు పెట్టి వారి మధ్య చిచ్చు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి అంటేనే కమీషన్… కమీషన్ అంటేనే రేవంత్‌రెడ్డి అన్నట్టుగా పాలన సాగుతుందని దుయ్యబట్టారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించి సరిగ్గా నాలుగేండ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల 17న ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్ పాల్గొన్నారు.
కేసీఆర్ హయాంలో గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచితే.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ తండాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మహబూబ్‌నగర్‌లో గిరిజన మహిళలు, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాల్యానాయక్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3,146 తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. దీంతో సుమారు 30 వేల మంది గిరిజనులు ప్రజాప్రతినిధులుగా ఎదిగారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు. గిరిజన జనాభాకు అనుగుణంగా కేసీఆర్ రిజర్వేషన్లు పెంచడంతో ఎస్టీ విద్యార్థులు ఏటా అత్యధికంగా వైద్య రంగంలో సీట్లు పొందుతున్నారని తెలిపారు. హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్, కొమురం భీం ఆదివాసీ భవన్ నిర్మించామని తెలిపారు. గిరిజనుల కోసం రూ.100 కోట్ల ఆస్తులు, రూ.25 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు.

గిరిజన హక్కుల రక్షణ కోసం స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి తెలిపారు. స్వయం పాలన కోసం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించినట్టు చెప్పారు. మంగళవారం జగిత్యాలలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గిరిజనుల జనాభాకు అనుగుణంగా విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో ఏటా వైద్య రంగంలో 440మంది ఎంబీబీఎస్ సీట్లు పొందుతున్నారని వివరించారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రక టించి నాలుగేండ్లు పూర్తవుతున్న సందర్భం గా ఈ నెల 17న ప్రతి తండా, గూడేల్లో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పాలనలో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లా తిరుమల హిల్స్‌లో గిరిజన నాయకులతో నిర్వహించిన సమావేశం అనంతరం జడ్చర్లలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తండాలు అభివృద్ధికి దూరంగా ఉండేవని, కనీసం రోడ్లు, తాగునీళ్లు దొరుకని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక తండాల్లో ప్రగతి పరుగులు పెట్టిందని పేర్కొన్నారు. తండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటైన తర్వాత వాటి రూపురేఖలే మారిపోయినట్టు చెప్పారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని అన్నారు. 70 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధిని బీఆర్ఎస్ చేసి చూపించిందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గిరిజన రైతుల భూములు లాక్కుంటున్నదని, మహిళా రైతులపై దాడులు చేసి చిత్రహింసలు పెడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని బొందపెట్టేందుకు గిరిజనులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన బాన్సువాడలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమం, తండాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఈ నెల 17న ప్రతి తండాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలుపాలని సూచించారు. తండాల్లో రోడ్లు, తండాలను జీపీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ సర్కార్ కొత్తగా 71 గిరిజన గురుకులాలను ఏర్పాటు చేసిందని, గిరిజన మహిళా పారిశ్రామిక వేత్తలకు టీహబ్ ద్వారా ఉపాధి కల్పించినట్టు చెప్పారు. మూడు ట్రైబల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.
తుంగతుర్తి, సెప్టెంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ప్రకటించిన గిరిజన డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గిరిజన నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ధ్వజమెత్తారు. గిరిజన విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.