(‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ప్రతినిధి) : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల శాసనసభను వేదికగా చేసుకొని తన ఇమేజ్ను పెంచుకొనే ప్రయత్నం చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రెవెన్యూశాఖపై గత శనివారం జరిగిన స్వల్పకాలిక చర్చకు మంత్రి సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. దాదాపు నాలుగు గంటలు ప్రసంగించిన మంత్రి తన శాఖకు సంబంధించిన అంశాలపై వివరణ ఇ వ్వడంతోపాటు తన రాజకీయ ప్రాధాన్యాన్ని, తన పాత్రను, తన వ్యక్తిగత త్యాగాన్ని పదేపదే వివరించేందుకు ప్రయత్నించారు. ఆయన ప్రయోగించిన పదజాలం, మితిమీరిన ఆత్మస్తుతి, స్వోతర్ష, తోటి నాయకత్వానికి పంపిన పరోక్ష సంకేతాల వెనుక తన ప్రాధాన్యాన్ని పెంచుకొనేందుకు, కాంగ్రెస్ పార్టీలో తన స్థానమేమిటో చాటిచెప్పడానికి చేసిన ప్రయత్నం గా కనిపించిందని అంటున్నారు.
పొంగులేటి ప్రసంగంలో ‘ప్రభుత్వం’ అనే సమష్టి కంటే ‘నేను’ అనే వ్యక్తిగత స్వరం ఎ కువగా వినిపించిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తన పాత్రను తానే ప్రస్తావించుకోవడం, తా ను ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నానంటూ వివరించుకోవడం, ఒక రూపాయి జీతం తీ సుకుంటున్నానని పదేపదే చెప్పుకోవడం వంటివన్నీ ప్రతిపక్షానికి ఇచ్చిన కౌంటర్ కాద ని, తన రాజకీయ ఇమేజ్ను బలోపేతం చేసుకునే ప్రయత్నంగా కనిపిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. సాధారణంగా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వంలోనైనా కీలక విధానాలపై మంత్రి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రిని ముందుకు తెచ్చి, ప్రభుత్వ ఘనతను, సీఎం మార్గదర్శకత్వాన్ని, క్యాబినెట్ సమష్టి కృషిని ప్రస్తావించడం సంప్రదాయం. కానీ, పొంగులేటి ప్ర సంగంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావన నామమాత్రంగా కూడా లేకపోవడం నివ్వెరపరిచిందని అంటున్నారు. ఒకటిరెండు చోట్ల మొకుబడిగా గౌరవ ముఖ్యమంత్రి అన్న పదం పలికారు తప్ప, రేవంత్ పేరును నేరుగా ఉచ్చరించడానికి ఆయన సంకోచించారని చెప్తున్నారు. ప్రతి నిర్ణయం వెనుక తన పాత్రే కీలకం అన్నట్టుగా ఆయన వ్యవహరించిన తీరు సహచర మంత్రులకే తీవ్ర విస్మయం కలిగించింది.
తన ప్రసంగంలో పొంగులేటి వాడిన రూపకాలు అత్యంత వ్యూహాత్మకంగా, అంతర్గత ప్రత్యర్థులను ఉద్దేశించినట్టుగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది ‘పాలు పొంగితే..! ఆ పొంగు చల్లారడానికి నీళ్లు చల్లొచ్చు.. కానీ కృష్ణా, గోదావరి నదులు పొంగితే ఆ వరద ఉధృతిని ఎవరూ తట్టుకోలేరు. ఆ ప్రవాహంలో మీరే కాదు.. మీ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుంది’ అంటూ చేసిన వ్యాఖ్యలో ఓ సంకేతం బయటపడింద ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తన పేరును ఉద్దేశించి ప్రత్యర్థులు చేస్తున్న ‘పొంగులేటి.. పొంగు’ వ్యాఖ్యలకు ఆయన ఈ విధంగా హెచ్చరించినట్టు అభిప్రాయపడుతున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాల నుంచి గాంధీభవన్, సచివాలయం వరకు తన ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు, తనకు వ్యతిరేకంగా చక్రం తిప్పుతున్న నేతలకు ఆయన నేరుగా సవాలు విసిరారనే చర్చ జరుగుతున్నది. తన జోలికి వస్తే ఆ రాజకీయ ప్రవాహానికి ఎదురునిలువడం ఎవరి వల్లా కాదన్న తీవ్ర హెచ్చరిక నదుల గురించి ప్రస్తావించడం ద్వారా చేశారని, ఒక మంత్రి తన శాఖను సమర్థించుకోవడం నుంచి, తన ‘పొంగు’ను ప్రత్యర్థి పార్టీని ముంచెత్తే వరదగా అభివర్ణించే స్థాయికి వెళ్లడం వెనుక రాజకీయ ఆత్మవిశ్వాసం మాత్రమే ఉందా? లేక భవిష్య త్ రాజకీయ స్థానంపై ఒక సంకేతం ఉందా? అనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో మొదలైనది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రా వడానికి తానే ప్రధాన కారణమన్నట్టు పొంగులేటి చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తించాయి. ఉమ్మడి ఖమ్మంతోపాటు పొరుగు జిల్లాల్లో పార్టీ ఏకపక్ష విజయానికి తా నే మూలకారణమని క్రెడిట్ అంతా తన ఖా తాలోనే వేసుకొనే ప్ర యత్నం చేశారని పరిశీలకు లు చెప్తున్నారు.
రెవెన్యూ, 22ఏపై చర్చ ముగిసిన వెంటనే అసెం బ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడతాయని అంతా భావించారు. కానీ 16కి వాయిదా వే స్తున్నట్టు ప్రకటించడం చర్చకు దారితీసింది. దీని వెనుక సీఎం వ్యూహం స్పష్టంగా కనిపిస్తున్నదంటున్నారు. పొంగులేటి తీరుతో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, 22ఏ అంశం పై తానే స్వయంగా రంగంలోకి దిగి సమాధానం చెప్పాలని సీఎం నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇది పొంగులేటి దూకుడుకు కళ్లెం వేసే సంకేతమేనని చర్చ సాగుతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తన పాత్రను ప్రత్యేకంగా ఎందుకు గుర్తుచేసుకున్నారు? ‘ఒక రూపాయి జీతం’ అనే వ్యక్తిగత త్యాగాన్ని ప్రధాన ఆయుధంగా ఎందుకు మలిచారు? ‘పొంగు’ అనే పదాన్ని రాజకీయ శక్తికి ప్రతీకగా ఎందుకు మార్చుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ ఒక ప్రసంగంలోనే దొరకదు అంటున్నారు రాజకీయ పండితులు. తనకంటూ ఒక స్వతంత్ర రాజకీయ బ్రాండ్‌ను నిర్మించుకోవాలన్న ప్రయత్నం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నదని చెప్తున్నారు. పార్టీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగటం, భవిష్యత్ ముఖ్యమంత్రి స్థాయి నేతగా ఎస్టాబ్లిష్ చేసుకోవడం, తద్వారా హైకమాండ్ వద్ద తన పరపతిని పెంచుకోవాలనేది ఆయన అంతర్గత వ్యూహంగా విశ్లేషకులు అనుమానిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న 22ఏ నిషేధిత భూముల జాబితా వ్యవహారంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతున్నది. ఈ విమర్శలకు రెవెన్యూ మంత్రిగా సమాధానం ఇచ్చిన పొంగులేటి 22ఏ విషయంలో అకడకడా పొరపాట్లు, తప్పులు జరిగాయని స్వయంగా అంగీకరిస్తూనే, మిగిలిన సమయమంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై వ్యక్తిగత దూషణలకే కేటాయించారు. పసలేని మాటలతో, వ్యక్తిగత దూషణలతో విలువైన అసెంబ్లీ సమయాన్ని వృథా చేశారంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతున్నది. పొంగులేటి ప్రసంగంతో ప్రభుత్వ వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లకపోగా, ప్రభుత్వంపైనే అనుమానాలు రేకెత్తేలా మాట్లాడటంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.