హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/మణికొండ, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఆదరువు లేక ప్రభుత్వ భూమిలో ఓ నిరుపేద గుడిసె వేసుకుంటే అధికారులు రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం నుంచి అన్నిరకాల అనుమతులు తీసుకొని ఇండ్లు కట్టుకుంటే ‘బఫర్‌జోన్’ అంటూ హైడ్రా ఎలాంటి నోటీసులు లేకుండానే నేలమట్టం చేస్తున్నది. సామాన్యుడిపై ఇదెక్కడి దౌర్జన్యమని ఎవరైనా ప్రశ్నిస్తే.. జలవనరులను కాపాడొద్దా? అంటూ ఎదురుదాడి చేస్తున్నది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ విషయంలోనూ అంతే. సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయం నడుస్తున్నది. ఎవరైనా ప్రశ్నిస్తే ‘అవి కలుషితమవుతుంటే చూస్తూ ఉండాలా?’ అని ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎదురుదాడి చేస్తారు. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏకంగా జీవో 111ను ఉల్లంఘిస్తూ క్రషర్స్ నడుపుతున్నా.. రెండేండ్లుగా నిరాటంకంగా అక్రమ మైనింగ్ కొనసాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి సైతం ‘అనుమతిలేని ఆ క్రషర్‌ను మూసివేయండి’ అని క్లోజర్ ఉత్తర్వులు ఇచ్చి, ఆ కాగితాలను కోల్డ్ స్టోరేజీలో పడేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిరక్షణ కోసం జీవో 111ను తెచ్చిన సంగతి తెలిసిందే. జంట జలాశయాల చుట్టూ ఉన్న 84 గ్రామాల పరిధిలోని క్యాచ్మెంట్ ఏరియాలో ఎలాంటి కాలుష్య కారకాలు ఉత్పత్తి చేసే సంస్థలను ఏర్పాటు చేయొద్దని, విషపూరిత రసాయనాలు అమ్మే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వరాదని స్పష్టమైన నిబంధనలు పొందుపరిచింది. అయినా వీటిని అతిక్రమిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా క్రషర్ నిర్వహిస్తున్నదని, సహజ వనరులను కొల్లగొడుతున్నదని, రూ.వందల కోట్లు దోచుకుంటున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిరోజుల కిందట మంత్రి పొంగులేటి కుమారుడు గండిపేట రెవెన్యూ మండల పరిధి వట్టినాగులపల్లిలో విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు దాదాపు వందమంది బౌన్సర్లతో అర్ధరాత్రి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికారులు చర్యలు తీసుకోగా, తన కుమారుడిపై కేసు నమోదు చేసిన అధికారులను మంత్రి బదిలీచేయించారన్న వార్త అప్పట్లో పెనుసంచలనం రేపింది. తాజాగా శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని సర్వేనంబర్లు 62, 63లోని ఐదెకరాల అసైన్డ్ భూముల్లో రెండేండ్లుగా రాఘవ కన్స్ట్రక్షన్స్ భారీ క్రషర్లు నడుపుతున్నదని స్థానికులు చెప్తున్నారు. గుట్టలను పిండి చేస్తున్నా, చర్యలు తీసుకోవాల్సిన పొల్యూషన్ బోర్డు, మైనింగ్, రెవెన్యూ, విద్యుత్, తదితర శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో భారీ క్రషర్ మెషీన్లను దింపి నగర నలుమూలల్లో ఆ సంస్థ చేపట్టిన ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే రాతి ఇసుకను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో రెండేండ్లలో రూ.వందల కోట్ల లావాదేవీలు జరిగాయని, అటు ప్రకృతికి, ఇటు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎలాంటి అనుమతి లేకుండా క్రషర్ ఎలా నడుస్తున్నదని తహసీల్దార్ రవీంద్ర దత్‌ను ప్రశ్నించగా శంషాబాద్‌లో 20కి పైగా రెడిమిక్స్, మరో నాలుగు క్రషర్ మెషీన్లకు అనుమతులు లేవంటూ కాలుష్య నియంత్రణ మండలి నుంచి నోటీసులు వచ్చాయని, వాటిని తొలగించామని తెలిపారు. రాఘవ కన్స్ట్రక్షన్స్కు చెందిన క్రషర్ల విషయం తన దృష్టికి రాలేదని చెప్పడం గమనార్హం. అయితే వాస్తవాలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. మైనింగ్ స్పష్టంగా కనిపిస్తున్నా, అధికారులు మాత్రం ఎలాంటి ఊరూపేరు లేని నోటీసులతో రెండేండ్లుగా కాలయాపన చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుడు ఫిబ్రవరిలో కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వుల్లో కూడా వివరాలేమీ లేవని, తాజాగా మంత్రి కంపెనీ నిర్వాకాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో అధికారులు ఈ ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన క్లోజర్ ఉత్తర్వులను చూపుతున్నారని తెలుస్తున్నది. దీన్ని బట్టి అధికారులు ఏటా ఫిబ్రవరిలో ఊరూ, పేరూ లేకుండా క్లోజర్ ఉత్తర్వుల్ని జారీ చేసి, వాటిని మూలన పడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా గనుల శాఖ అధికారులు ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి చూడలేదని సమాచారం. గురువారం ‘నమస్తే తెలంగాణ’ ఈ అంశంపై సంప్రదించగా, తాము బుధవారమే వెళ్లి పరిశీలించామని, అనుమతులు లేనందున మూసివేయాలని ఆదేశించామని చెప్పారు. ఇక తమ వంతు అయిపోయిందని, రెవె న్యూ, కాలుష్య నియంత్రణ మండలి తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంటే ఒక శాఖపై మరో శాఖ నెపాన్ని నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.