హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): ఆర్థిక, సంక్షేమ విధానాలకు సంబంధించి ప్రభుత్వ ప్రాధాన్యాలను కోర్టులు నిర్ణయించలేవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్థిక విధానాల్లో కోర్టుల జోక్యం పరిమితమని తెలిపింది. ప్రభుత్వ విధానం ఏకపక్షంగా, వివక్షాపూరితంగా లేదా రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు రుజువైతే తప్ప జోక్యం చేసుకోలేమని పేరొన్నది. కొవిడ్ సమయంలో 2019లో ఖరీఫ్, రబీ సీజన్లకు రైతుబంధు చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం తల్లాడ, తెలగారం రెవెన్యూ గ్రామాలకు చెందిన టీ వెంకటనారాయణ, మరో నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి రైతుబంధు చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ప్రభుత్వ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. కొవిడ్ సమయంలో తకువ విస్తీర్ణం ఉన్న రైతులకు ప్రాధాన్యం ఇచ్చినట్టు ప్రభుత్వం సమర్పించిన వివరాల ద్వారా స్పష్టమవుతున్నదని పేరొన్నది. 2019 వానకాలంలో 1.42 లక్షల మంది రైతులకు రూ.850.82 కోట్లు, యాసంగిలో 9.46 లక్షల మంది రైతులకు రూ.2,132.95 కోట్ల నిధులు విడుదల చేయలేదని తెలిపింది.
దీంతో పిటిషనర్లు మాత్రమే ప్రత్యేకంగా వివక్షకు గురయ్యారని చెప్పడానికి ఆధారం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిధుల కేటాయింపులపై న్యాయ సమీక్ష పరిధిని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ధర్మాసనం పేరొన్నది. ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యాలు, నిధుల లభ్యత వంటి అంశాలను ప్రభుత్వాలే నిర్ణయించాల్సి ఉంటుందని, కోర్టులు కాదని తెలిపింది. రైతుబంధు పథకం కింద నిధులు విడుదల చేయాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను అనుమతించింది.