గురువు చోరుడైతే శిష్యుడికి ఏం నేర్పుతాడు? చోరవిద్యే కదా! ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో చరిత్రకెక్కిన ఏలేరు కుంభకోణం సినిమాను, ఆయన శిష్యరికంలో అన్ని విధాలుగా ఆరితేరిన శిష్యుడు తన పాలనలో రిపీట్ చేసి చూపిస్తున్నాడు. ఏలేరు ప్రాజెక్టు కుంభకోణంలో.. కాలువల్లో తమ భూములు కోల్పోయామంటూ కొందరు నకిలీలు దొంగ క్లెయిమ్‌లు దాఖలు చేసి, న్యాయవ్యవస్థకు చెందిన కొందరితో కుమ్మక్కై పరిహారాన్ని వందల రెట్లు పెంచుకొని కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.
ఇప్పుడు అలాంటి సినిమానే తెలంగాణ తాజా ప్రభుత్వం హకీంపేట-లగచర్ల-పోలేపల్లి ప్రాంతంలో చేపట్టిన మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్క్‌లో రిపీట్ చేస్తున్నది. ఇక్కడ క్షేత్రస్థాయిలో సర్కార్ భూములు తెల్లారేకల్లా వందలకు వందల ఎకరాలు పెరిగిపోతున్నయి. గుంట భూమికూడా లేని వాళ్లు ఆ భూములకు యజమానులుగా పుట్టుకొచ్చి రాత్రికిరాత్రే రైతులుగా మారిపోతున్నరు. ఈ సంఖ్య ఇప్పటికే 175 దాటింది. ఇది ఎక్కడ ఆగుతుందో ఎవరికీ తెలియదు.
పట్టా చేతికి రావడం ఆలస్యం.. వీళ్ల పేరుమీద కోట్లాది రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ఆగమేఘాలమీద విడుదల చేస్తున్నది. మల్టీపర్పస్ పార్క్‌ను మనీ పర్పస్ ప్రాజెక్టుగా మార్చుకుంటూ ఇక్కడ ఓ కొంగుచాటు కాంగ్రెస్ నాయకుడు ఎగిరెగిరి పడుతున్నాడు. ఆడవాళ్ల పేర్లు చెప్పుకొని బతికే ఆ శాల్తీ తెగ రెచ్చిపోతున్నాడు. నకిలీలే కాదు, అసలు రైతుల పరిహారంలోనూ వాటాలు గుంజుతు న్నాడు. పునరావాస కాలనీలో ప్లాట్లు కొట్టేస్తున్నాడు. ఆ ఒక్కడే కాదు, సర్కార్ గీత దాటేసి బరితెగించిన ఈ కుంభకోణంలో ఓ షాడో, ఓ బిగ్షాడోతో పాటు ఓ బిగ్ మేడమ్ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. మేడమ్ ఆజ్ఞలకు ‘జీ హుజూర్’ అనే అధికారులు న్నరు. హకీంపేట ఇప్పుడు ముఖ్యనేత కుటుంబ హుకూంపేటగా మారింది. తొండలు గుడ్లు కూడా పెట్టని ఆ భూముల్లో ముఖ్యనేత కుటుంబం ఇప్పుడు వందల కోట్లు పండించుకుంటున్నది!
అసలు ఇదెక్కడ ప్రారంభమైంది? కొంతకాలం కింద లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్‌కు భూసేకరణ పేరిట ప్రభుత్వం రైతుల భూములు లాక్కోవాలని ప్రయత్నించిన ప్పుడు ప్రజలు తిరుగబడి భూసేకరణకు వచ్చిన కలెక్టర్‌నే తరిమికొట్టిండ్రు. ప్రభుత్వం వందలాది మంది పోలీసులను ఉసిగొల్పి ప్రజల మీద దమనకాండకు దిగింది. అర్ధరాత్రి తెల్లవారుజామున దాడులు చేసిన పోలీసులు కనిపించిన మగవాళ్లందర్నీ గుంజుకపోయి జైల్లో పెట్టిండ్రు. ఈ దాడులకు భీతిల్లిన మొగోళ్లు చాలామంది గ్రామాలు వదిలి పారిపోయిండ్రు. ఇదే అదనుగా అధికారులు ఈ ప్రాంతంలోని భూ రికార్డులను ఉన్నఫలంగా మార్చేసిండ్రు. సర్కార్ భూములను రాత్రికి రాత్రి వందలాది ఎకరాలు పెంచేసిండ్రు. ఇప్పుడు ఆ భూముల్లోనే పరిహారం దోపిడీ వేట మొదలైంది!
గజ్జల కుటుంబంలో కాసుల గలగల హకీంపేట సర్పంచ్ భర్త గజ్జల నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు ఏకంగా 16 ఎకరాలు రాసుకొని భారీగా పరిహారం నొక్కేశారు. దుద్యాల మండలం హకీంపేట సర్వేనంబర్ 252లో ప్రభుత్వ భూమిని కూడా ఇండస్ట్రియల్ పార్కుకు సేకరించారు. ‘ఊరందరికీ పరిహారం ఇప్పిస్తున్నా’ అనుకున్నారేమో.. గజ్జల కుటుంబం వంతుగా ఏకంగా 16 ఎకరాలకు రూ.3.20 కోట్లు తీసుకొని ‘ఔరా’ అనిపించారు.
నాకు హైదరాబాద్ కొండాపూర్‌లో 11 ఎకరాల భూమున్నది. నేను అవసరమనుకుంటే కొడంగల్ నియోజకవర్గాన్నే కొనగలను..
-ఇటీవల తన స్నేహితుడి ఇంట్లో నర్సింహారెడ్డి మాట్లాడిన మాటలివి!

మహబూబ్‌నగర్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘తొండలు గుడ్లు పెట్టని ఈ భూముల్లోకి నేను పారిశ్రామికవాడ తీసుకొచ్చి, పరిశ్రమలను తెస్తే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నా ప్రాంతం అభివృద్ధి జరుగుతది. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినందుకు కృతజ్ఞతగా ఈ పని చేస్తున్న’.. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల భూ సేకరణ వివాదం నేపథ్యంలో 2024 నవంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. కానీ.. తొండలు గుడ్లు పెట్టని ఆ భూముల్లోనే అక్రమార్కులు రూ.కోట్లు దండుకుంటున్నారు.
దుద్యాల మండలం హకీంపేట-లగచర్ల-పోలేపల్లి గ్రామాల పరిధిలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవాడలో ప్రజాధనం లూటీ అవుతున్నది. ముఖ్యనేత అనుచరులు సూత్రధారులుగా, కుటుంబసభ్యులే తెరవెనుక శక్తులుగా సాగుతున్న ఈ దందాలో నకిలీ రికార్డులు, నకిలీ రైతులు పుట్టుకొచ్చి పరిహారం కొట్టేశారు. ప్రభుత్వ భూములను తమవిగా చూపి రూ.కోట్లు పండించుకుంటున్నారు.
లంబాడీ, గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల భూములకు యజమానులమంటూ రికార్డు లకెక్కి భారీ దోపిడీకి తెరలేపారు. ‘ఏదో ఒక గోడ కడుతున్నట్టు.. గులాబీ మొక్కకు అంటుకడుతున్నట్టు.. వీడు చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, పద్ధతిగా కొట్టాడు’ అంటూ ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఉంటుంది. అచ్చం ఇలాగే హకీంపేట ఇండస్ట్రియల్ పార్క్‌లోనూ అక్రమార్కులు ఓ పద్ధతి ప్రకా రం ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ముందుగా ప్రభుత్వ భూమి విస్తీర్ణాన్ని పెంచేశారు. గుంట భూమి లేనివారిని రైతులుగా మార్చి, రికార్డుల్లో వారి పేరుమీద ఎకరాలకు ఎకరాలు సృష్టించి, బాధితులమంటూ ఆ మొత్తానికి పరిహారాన్ని దండుకున్నారు.
ఆర్అండ్ఆర్ కింద వచ్చిన ప్లాట్లనూ తీసుకున్నారు. అర్హులైన రైతుల నోళ్లుకొట్టి, వారిని నయానో, భయానో బెదిరించి మరింత కొల్లగొట్టారు. చివరికి ఆర్అండ్ఆర్ కాలనీలోనూ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భూములను ఖాళీ ప్రాంతాలుగా చూపెట్టి, తమ కోసం దాచిపెట్టుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలా వందలాది మంది రైతుల ‘నుదుటి గీత’ను మార్చడం వెనుక ముఖ్యనేత షాడో ఉన్నదని చెప్తున్నారు.

కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో భావించగా, లగచర్లలో చేసిన దమనకాండ జాతీయ స్థాయిలో వివాదం అయింది. దీంతో ఫార్మా విలేజ్‌ను పారిశ్రామికవాడగా మార్చింది. ఇందుకోసం హకీంపేట-లగచర్ల పోలేపల్లి గ్రామాల పరిధిలో సుమారు 1,368 ఎకరాల భూములను సేకరించింది. ఇందులో ప్రైవేట్ పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. హకీంపేట గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 252లో సుమారు 219.21 ఎకరాల భూమి ఉన్నది.
ఇందులో 197 ఎకరాలు సాగులో ఉండగా మిగతా 22.24 ఎకరాలు మిగులు భూమి. ఈ భూములకు సంబంధించి సుమారు 166 మంది రైతులకు ఎప్పటి నుంచో పట్టాలు ఉన్నాయి. 2003-04లో ఆరుగురు రైతులు దరఖాస్తు చేసుకోగా, వారికి ప్రభుత్వం అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. సర్వే నంబర్ 252లో 219.21 ఎకరాలు మాత్రమే భూమి ఉండగా, ప్రభుత్వం ఏకంగా 351.10 ఎకరాలు సేకరిస్తున్నామంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే సర్వే నంబర్లో ఉన్న భూమి కన్నా ఏకంగా 132 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. ఈ విస్తీర్ణానికి ప్రభుత్వం పరిహారం పంపిణీ చేసింది.
అక్కడితో ఆగకుండా ఏండ్లుగా సాగుచేసుకుంటున్న రైతుల విస్తీర్ణాన్ని రాత్రికి రాత్రే తగ్గించేసి, ఆ మొత్తాన్ని బినామీల పేర్ల మీదికి ఎక్కించినట్టు ఆరోపిస్తున్నారు. మొత్తంగా 150 ఎకరాల వరకు గోల్మాల్ జరిగిందని చెప్తున్నారు. దీని వెనుక ‘బిగ్ షాడో’ ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పారిశ్రామికవాడతో నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 లక్షలు, 150 గజాల ప్లాటు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. నకిలీ రైతులతో ముందే మాట్లాడుకొని వారికి ఎంతో కొంత ముట్టజెప్పి మిగతాదంతా బిగ్ షాడో తన జేబులో వేసుకున్నారని అంటున్నారు.
ఉదాహరణకు తన ఇంట్లో పనిచేస్తున్న ఒక మహిళ పేరున నకిలీ జాబితాలో రెండు ఎకరాలు చేర్చారని, పరిహారం వచ్చిన తర్వాత ఆమెకు రూ.5 లక్షలు ఇచ్చి మిగతాది తానే తీసుకున్నాడని చెప్తున్నారు. ఇలా నకిలీలకు వచ్చిన ప్లాట్లు సైతం ఆయన స్వాధీనంలోనే ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు.. భూములు కోల్పోయిన రైతులకు అనధికారికంగా మరో రూ.10 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం రూ.120 కోట్లు విడుదల చేసినట్టు సమాచారం.
ఇందులో నిజమైన రైతులకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వకుండా, ఎంతో కొంత ముట్టజెప్పినట్టు సమాచారం. నకిలీ రైతుల పేరుతో వచ్చిన మొత్తం బిగ్ షాడో జేబులోకే వెళ్లిందని చెప్తున్నారు. దీనికి అదనంగా ఎకరాలోపు అయితే 75 గజాలు, ప్రతి ఎకరాకు 150 గజాలు చొప్పున ఇచ్చే ప్లాట్లు కూడా కొట్టేశారని అంటున్నారు. ఇక్కడ విషాదం ఏమిటంటే.. విస్తీర్ణం తగ్గిన అసలు రైతులకు ఒకటి అరా ప్లాట్లు దక్కగా, రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన నకిలీ రైతులకు మాత్రం నాలుగైదు చొప్పున ప్లాట్లు కేటాయించారు. వాస్తవానికి సర్వే నంబర్ 252కు సంబంధించి దాదాపు 17 ఏండ్లపాటు రికార్డులే లేవని తహసీల్దార్ కార్యాలయం సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారంలో ధ్రువీకరించింది. మరి 17 ఏండ్లపాటు లేని రికార్డులను ఇప్పుడు ఎలా మార్చారు? లేని భూమిని సృష్టించి, విస్తీర్ణాన్ని పెంచి, పరిహారం ఎలా ఇచ్చారన్నది బాధితుల ప్రశ్న.

252 సర్వే నంబర్లో భూమి వివరాలు సర్టిఫై చేస్తూ వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట తహసీల్దార్ ఇచ్చిన కాపీ, భూమి అమ్మినట్టు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీ

ఓవైపు రెవెన్యూ రికార్డుల్లో అడ్డగోలుగా భూ విస్తీర్ణం పెంచగా, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి, ఆ భూమిని కొలిచినట్టుగా నమోదు చేయడం, ఉన్నతాధికారులకు పంపడం విశేషం. వాస్తవానికి అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేయలేదని, ముఖ్యనేత షాడో చెప్పినట్టు రాసుకొని వెళ్లారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సంతకాలను కూడా ఫోర్జరీ చేశారని చెప్తున్నారు. గతంలో ప్రభుత్వం ఫార్మావిలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం, రైతులు తిరుగబడటం, ఆ తర్వాత లగచర్లలో దమనకాండ జరిపిన సంగతి తెలిసిందే.
భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగి రైతులపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారు. లగచర్ల చుట్టుపక్కల గ్రామాల్లోనూ నిర్బంధం కొనసాగింది. దీంతో పోలీసులు ఎప్పుడు తమ ఇండ్లపై దాడి చేస్తారో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో? అనే భయంతో చాలామంది గ్రామాలు విడిచి పారిపోయారు. ఇదే సమయంలో ‘బిగ్షాడో’ తన పథకాన్ని అమలు చేశాడని చెప్తున్నారు. ఉద్రిక్తతలు సద్దుమణిగి రైతులు తమ ఇంటికి వచ్చేలోపే ప్రభుత్వ భూములను చెరబట్టి, ఇష్టానుసారంగా రికార్డులు మార్చి విస్తీర్ణాలు పెంచేశారని ఆరోపిస్తున్నారు.
సర్వేకోసం వచ్చిన అధికారులతో తమకు అనుకూలంగా నివేదికలు తయారు చేయించారని తెలిపారు. రైతుల సంతకాలను ఫోర్జరీ చేయించారని, భూములు ఇచ్చేందుకు వాళ్లంతా సమ్మతిస్తున్నట్టు సర్వే నివేదికలపై సంతకాలు చేయించి పంపించారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు సైతం వీటిని పరిశీలించకుండా, నిజమో, కాదో విచారణ చేయకుండా రైతులందరూ భూములు ఇచ్చేశారంటూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. వాటి ఆధారంగానే పరిహారం పంపిణీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ‘మేము మా ఊళ్లకు చేరుకోకముందే మా భూములను ప్రభుత్వం గుంజుకున్నది’ అంటూ గ్రామాల నుంచి పారిపోయినవారు, జైళ్ల నుంచి విడుదలైన రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
పారిశ్రామికవాడ పేరుతో సేకరించిన భూముల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరపాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి గురువారం లోకాయుక్తను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై సాక్ష్యాధారాలతో సహా లోకాయుక్తకు ఫిర్యాదు చేసి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సాగు భూములను గుంజుకొని అమాయక రైతులను నట్టేట ముంచారని.. లేని భూములను సృష్టించి బినామీల పేరుతో పరిహారం కొట్టేశారని ఆరోపించారు.
ఈ అక్రమాలకు వికారాబాద్ జిల్లా అధికార యంత్రాంగం దాసోహం అయ్యిందని పేర్కొన్నారు. పారిశ్రామిక కారిడార్ చుట్టూ ఇంకా పోలీసుల నిర్బంధకాండ కొనసాగుతున్నదని తెలిపారు. 13 వందల ఎకరాలు సేకరించినా, సీఎం రేవంత్‌రెడ్డికి భూ దాహం తీరలేదని, నియోజకవర్గంలో పదివేల ఎకరాలు సేకరించి అనేక కుటుంబాలను రోడ్డుపాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, పోలీసులు మేల్కొని ఈ అక్రమాలకు సహకరించడం మానేయాలని, నిజమైన రైతులకు ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలను సహించేది లేదని, ఎప్పటికైనా దీనిపై విచారణ జరిపి, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ మొత్తం పథకం వెనుక ఉన్నది ‘బిగ్ షాడో’ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఆయన ముఖ్యనేత ఇంట్లో పనిమనిషి అని, ఆ ఇంటి వ్యక్తుల ఆశీస్సులతో ‘బిగ్ షాడో’గా ఎదిగారని చెప్తున్నారు. హకీంపేటలో ఏర్పాటు చేస్తున్న ఈ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఆయన జాతకాన్నే మార్చేసిదని స్థానికులు చెప్తున్నారు. సరిగ్గా మూడున్నరేండ్ల క్రితం అయనో మామూలు వ్యక్తి. ఆయనకు గ్రామంలో కనీసం రూ.5,000 కావాలన్నా అప్పు పుట్టని పరిస్థితి అట!
కానీ ఇప్పుడు కోట్లాది రూపాయలు కురుస్తున్నాయని చెప్తున్నారు. విల్లాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడట. మరికొన్ని రోజుల్లో బెంజ్‌కారులో తిరిగి తన సత్తా ఏందో చూపిస్తానని సవాల్ విసురుతున్నట్టు చెప్తున్నారు. తనకు, తన కుటుంబానికి చెందిన సెంటు భూమి పోకున్నా నిర్వాసితుల జాబితాలో పేర్లు రాసుకొని కోట్లు కొల్లగొట్టేశాడనే ప్రచారం జరుగుతున్నది. మరోవైపు ఎప్పటినుంచో కాస్తులో ఉన్నవారిని బెదిరించి, వారికి వచ్చిన పరిహారంలో 50% వాటా తీసుకుంటున్నట్టు బయటపడింది.
మరికొందరు రైతులకు వచ్చిన పరిహారంలో కనీసం సగం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘మా నాన్న పేరు మీద పోలేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 67లో ఒక ఎకరా 20 గుంటల భూమి ఉన్నది. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. అడిగితే రూ.30 లక్షలు ఇవ్వబోమని, ఎనిమిది లక్షలే ఇస్తామని అంటున్నారు. దౌర్జన్యంగా మా భూములను లాక్కున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే అర్ధరాత్రి 40 మంది పోలీసులు మా ఇంటికి వచ్చి, మా నాన్నతోపాటు మా బంధువులను బలవంతంగా ఎత్తుకెళ్లారు.
మరుసటి రోజు వదిలిపెట్టారు’ అంటూ పోలేపల్లికి చెందిన ఓ బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. దీన్ని బట్టే బిగ్ షాడో అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బాధిత రైతులకు ప్రభుత్వం ఉచితంగా అన్ని వసతులతో కూడిన లేఅవుట్ చేసి భారీ వెంచర్ చేసింది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో వసతులు కల్పిస్తున్నారు. అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొన్న సదరు నేత.. పేదలకు ఇచ్చిన ప్లాట్లలో దందా మొదలుపెట్టాడు. ఇప్పటివరకు సుమారు 50 నుంచి 60 ప్లాట్లను అక్రమంగా బాధితుల నుంచి గుంజుకున్నట్టు ఆరోపణలున్నాయి.
ఇలా ఒక్కొక్కరి నుంచి మొత్తం ప్లాట్లను లాక్కొని ఈ కాలనీలో బడా పారిశ్రామికవేత్తలకు అమ్మేందుకు భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు.. పారిశ్రామిక కారిడార్‌లో భూములు కోల్పోతున్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి బిగ్ షాడో ఏకంగా రూ.3 కోట్ల గుడ్‌విల్ తీసుకొన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కారిడార్ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలుపెడితే సదరు బిగ్ షాడో కొంతమందిని పంపించి అడ్డుకొన్నట్టు చేసి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు తెలుస్తున్నది.
ఈ గుడ్‌విల్ కూడా మూడో కంటికి తెలియకుండా అందిందని ప్రచారం జరుగుతున్నది. ఈ కుంభకోణంలో సొంత కాంగ్రెస్ నేతలను కూడా దగ్గరికి రానివ్వడం లేదని, అంతా తానే అక్రమాలకు తెర లేపాడని చెప్తున్నారు. ఆయన కుటుంబసభ్యుల్లో ఒకరు రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడంలో సిద్ధహస్తులు కావడంతో ఈ పని సులువైపోయిందని అంటున్నారు.
బిగ్ షాడో ఈ స్థాయిలో రౌడీరాజ్యం నడుపుతున్నా.. అధికారులు, పోలీసులు నోరు మెదపడం లేదు. ఈ బిగ్ షాడో ఇప్పుడు ఏకంగా భవిష్యత్తు ఎమ్మెల్యేగా ఊహించుకుంటున్నాడని ప్రచారం జరుగుతున్నది. తన అనుచరులతో సోషల్ మీడియా ఖాతాలు తెరిపించి పొగడ్తల పోస్టులు వేయించుకుంటున్నాడని, వాట్సాప్‌లో తన పేరిట ‘సైన్యాలు’ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకుంటున్నాడని చెప్తున్నారు.
హకీంపేట పారిశ్రామికవాడలో జరుగుతున్న ఈ భారీ కుంభకోణం వెనుక ‘బిగ్ మేడమ్’ ఉన్నారని, వందలాది మంది రైతుల ‘నుదుటి గీత’ను మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిగ్ షాడో ఆ ఇంట్లో వంట మనిషిగా ఉన్నప్పుడే మేడమ్ దగ్గర నమ్మకం సంపాదించాడని అధికార పార్టీ నేతలు అంటున్నారు.
మేడం అండతో మెల్లగా ప్రజాప్రతినిధిగా అవతారం ఎత్తాడని, ఇప్పుడు ఏకంగా పారిశ్రామిక వాడకు అన్నీ తానై వ్యవహరిస్తూ చక్రం తిప్పుతున్నాడని చెప్తున్నారు. తన అనుచరుడికి సహకరించాలని ఆమె అధికారులను ఆదేశించారని దీంతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్‌పై పెత్తనం మొదలుపెట్టాడని అంటున్నారు.
కలెక్టర్‌తోపాటు ఆర్డీవో, భూసేకరణ అధికారులు, తహసీల్దార్, ఇటు పోలీసుల్లో జిల్లా ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఈయన చెప్పిందే వేదంగా మారిందట. వాస్తవానికి పరిహారానికి ఎవరెవరు అర్హులు? ఎంత ఇవ్వాలి? ప్లాట్ల అలాట్మెంట్ ఇలాంటివన్నీ కలెక్టర్ ఆధీనంలో జరుగుతుంటాయి. కానీ హకీంపేట పారిశ్రామిక వాడలో మాత్రం బిగ్ షాడో కనుసన్నల్లో జరిగిందని ఆరోపిస్తున్నారు. అందుకే బాధిత రైతుల్లో ఎవరైనా కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్లినా రిక్తహస్తాలతో తిరిగి రావాల్సిందేనని అంటున్నారు.
ఇందుకు ఉదాహరణగా.. ప్రభుత్వ భూమిలో ఏండ్లుగా మూడు ఎకరాలు సాగు చేస్తున్న ఓ రైతు నష్టపరిహారం రాలేదని న్యాయస్థానానికి వెళ్లి ఉత్తర్వులు తీసుకురాగా, కలెక్టర్ ‘మీ భూమిని 1997లోనే అమ్ముకున్నారు’ అంటూ తేల్చారని చెప్తున్నారు. మరికొంతమంది తమ భూములు పోయినా పరిహారం రాలేదంటూ ఆఫీస్‌ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం ఉండటం లేదన్నారు.
పైగా ఎవరైనా రైతులు ఎదురు తిరిగితే బిగ్ షాడో నుంచి బెదిరింపులు వస్తున్నాయని చెప్తున్నారు. ఓ రైతు తనకు పరిహారం రాలేదని వాట్సాప్‌లో మెసేజ్ పెడితే.. ‘నన్నే క్వశ్చన్ చేస్తవా? మీ ఇంటికి వచ్చి తంతా.. ఏమనుకుంటున్నావో..’అంటూ బెదిరించాడట. మరో రైతు కుటుంబానికి రూ.30 లక్షలు పరిహారం అందాల్సి ఉండగా, ‘8 లక్షలే ఇస్తాం..అవే తీసుకోండి లేకుంటే లేదు’ అని భయపెట్టాడని చెప్తున్నారు.
ఆ కుటుంబం ఎదురుతిరిగితే, ఆ ఇంటి మీద పోలీసులతో దాడి చేయించి 2రోజులు పోలీస్స్టేషన్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారని తెలిసింది. ‘నేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. 2నిమిషాల్లో సీఎంని కలిసి, ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ అంటూ దమ్కీలు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే అక్రమాలపై విచారణ జరపడానికి అధికారులు సాహసించడం లేదని వాపోతున్నారు.
1996-97లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో ఏలేరు కాలువ తవ్వకం, భూసేకరణ నష్టపరిహారం చెల్లింపుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. భూమి విలువను వందల రెట్లు పెంచి, తప్పుడు చెక్కులు మంజూరు చేసి ప్రభుత్వ ధనాన్ని కాజేశారు. అప్పట్లోనే రూ.100 కోట్ల మేర కుంభకోణం జరిగిందని అంచనా.
మానేరు ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో భూ సేకరణ, పునరావాస ప్యాకేజీల సమయంలో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి, రికార్డులను ట్యాంపరింగ్ చేసి దొడ్డిదారిన పరిహారం కొట్టేశారు. ప్రభుత్వం నకిలీ పట్టాలు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించింది.
గుంట భూమి కూడా లేని వ్యక్తులు రాత్రికి రాత్రే రికార్డుల్లో రైతులుగా మారిపోతున్నారు. రూ.కోట్లలో పరిహారం పొందుతున్నారు. వందల గజాల ప్లాట్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూములు, స్కూళ్లు, కాలేజీలను ప్రైవేట్ భూములుగా చూపెట్టి అక్రమార్కులు రూ.లక్షలు దండుకుంటున్నారు. ముఖ్యనేత షాడో కనుసన్నల్లో జరుగుతున్న ఈ కుంభకోణంలో రూ.కోట్ల ప్రజాధనం లూటీ అవుతున్నది.
అప్పటి వరకు గుంట జాగా లేని వ్యక్తులు కూడా సర్వే నంబర్ 252లో భూ విస్తీర్ణం పెంచిన తర్వాత రైతులుగా మారారని, వారి పేరుమీదికి ఎకరాలు వచ్చాయని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సుమారు 70-80 మంది బినామీ రైతులు పుట్టుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇందులో కొందరి వివరాలు..


పారిశ్రామిక వాడలో సుమారు 93 ఎకరాల్లో 620 మంది బాధితులకు ప్లాట్లను కేటాయిస్తున్నారు. అటు పరిశ్రమలు, ఇటు బాధితులఇండ్ల నిర్మాణంతో కొత్తగా ఒక పట్టణమే వెలిసేలా ఉన్నది. మెడికల్, ఇంజినీరింగ్, ఫిజియోథెరపీ, నర్సింగ్ కాలేజీలతోపాటు టీచింగ్ హాస్పిటల్ రావడంతో ఇప్పటికే కమర్షియల్‌గా మారిపోయింది. ఆర్అండ్ఆర్ కాలనీలోని రోడ్లకు ఆనుకొని ఉన్న ప్లాట్లు, ప్రైమ్ లొకేషన్లలో ఉన్న ఖాళీ స్థలాలపై బిగ్ షాడో ముఠా కన్నేసినట్టు సమాచారం.
లేఅవుట్ గుండా కోస్గి-తుంకిమెట్ల రోడ్డు వెళ్తున్నది. ఈ రోడ్డు వెంబడి అనేక చోట్ల ప్లాటింగ్ చేయకుండా, ఖాళీ స్థలాలుగా వదిలేశారని చెప్తున్నారు. భవిష్యత్తులో వాటిని కొట్టేసేందు కు ప్లాన్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రైమ్ లొకేషన్లలో ఉన్న ప్లాట్లను కేటాయించకుండా బ్లాక్ చేశారని, తమవారికే కేటాయించేలా బిగ్ షాడో స్కెచ్ వేశాడని అంటున్నారు. మరోవైపు ‘ఈ కాలనీలో ఉండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ అంటూ కొందరిని హెచ్చరించి, ప్లాట్లను గుంజుకుంటున్నట్టు వాపోతున్నారు.

సర్వేనంబర్ 252/26లో మేము ఏండ్లుగా సాగు చేసుకుంటున్నం. పాస్‌బుక్ కూడా వచ్చింది. 2014 వరకు రికార్డుల్లో నా పేరున్నది. ఓ మధ్యవర్తి వచ్చి ‘పరిహారం ఇప్పిస్తా. నీకు రూ.10 లక్షలు ఇస్తా, నాకు రూ.60 లక్షలు ఇవ్వాలి’ అని బేరం పెట్టిండు. రావాల్సిన నష్టపరిహారం కోసం కోర్టుకు పోతే, ఈ అంశం తేల్చాలని ఆదేశమిచ్చింది. దీన్ని పట్టుకొని కలెక్టర్ ఆఫీస్‌కు పోతే.. మీ భూమిని 1997లోనే అమ్మినట్టు రికార్డులున్నయ్ అని చెప్పిండ్రు. సాదాబైనామా పుట్టించి, నాకు తెల్వకుండనే వెంకటయ్య అనే వ్యక్తి భూమి కొన్నట్టు కలెక్టర్ కాగితం ఇచ్చిండు. నా సంతకం ఫోర్జరీ చేసి, నా నుంచి భూమి గుంజుకొని అన్యాయం చేసిండ్రు.
– దొడ్డి బాలరాజ్, హకీంపేట
సర్వేనెంబర్ 252/100లో నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. ఇందులో శ్రీ గంధం చెట్లు, ఇతర తోటలు పెంచుతున్నాను. బోర్లు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం నాకు ఒక ఎకరాకే పరిహారం ఇచ్చింది. ఈ పొలంలో రెండు భారీ షెడ్లు ఉండడంతో, వాటికి మాత్రమే పరిహారం ఇచ్చి మరో ఎకరా పరిహారాన్ని ఎగ్గొట్టింది. ఇదేమిటని అడిగితే ‘ఇవి కూడా రావు, ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో’ అని అధికారులు బెదిరించి, బలవంతం పెట్టి సంతకం చేయించుకొని పరిహారం ఇచ్చారు. హకీంపేటలో మా నాన్న వెంకటయ్య పేరిట రెండు ఎకరాల 20 గుంటల పొలం ఉన్నది. 20 గుంటలను మా నాన్న నాలా కన్వర్షన్లో మార్చుకున్నారు. ఆ భూమికి పరిహారం ఇవ్వకుండా, పాస్ పుస్తకంలో ఉన్న రెండు ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు. మాలాంటి ఎంతోమంది రైతులు ఇలా సగం సగం పరిహారం పొంది అన్యాయానికి గురవుతున్నారు.
– శివకుమార్, హకీంపేట
మా అమ్మ నర్ల ఆశమ్మ పేరుమీద సర్వేనెంబర్ 252లో నాలుగు ఎకరాల పొలం ఉన్నది. మేమే కాస్తులో ఉన్నాం. ఎండ్లుగా వ్యవసాయం చేస్తున్నాం. కాబట్టి రెవెన్యూ నిబంధనల ప్రకారం పరిహారం ఇస్తామని చెప్పి, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
– నర్ల హనుమంతు, హకీంపేట
సర్వేనెంబర్ 252/8లో నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది. మొత్తం పొలం గుంజుకున్నరు. పత్రాలన్నీ ఉన్నా నాకు ఇంకా పరిహారం ఇవ్వలేదు. అడిగితే దాటవేస్తున్నరు. లీడర్లు కమీషన్లు అడుగుతున్నరు. ఇప్పటికైనా నా భూమికి పరిహారం ఇచ్చి నన్ను ఆదుకోవాలి.
– బుగ్గప్ప, హకీంపేట
సర్వేనెంబర్ 252/15/51లో నాకు రెండు ఎకరాల పొలం ఉన్నది. దీంట్లో షెడ్లు, ఇల్లు కూడా ఉన్నాయి. నా పొలం మొత్తం గుంజుకున్నరు. పరిహారం ఇవ్వమంటే ఇవ్వడం లేదు. ఎందుకు? అని అడిగితే సమాధానం చెప్పడం లేదు.
– నరసమ్మ, హకీంపేట
గ్రామంలో మాది ఉమ్మడి కుటుంబం. ఐదుమంది అన్నదమ్ములం. సర్వే నంబర్ 252/34లో మొత్తం మాకు 12 ఎకరాల పొలం ఉన్నది. హకీంపేట పారిశ్రామిక కారిడార్‌లో మా భూమి మొత్తం పోతున్నది. ఒక్క ఎకరాకు మాత్రమే పరిహారం ఇచ్చారు. అడిగితే ‘మీ రికార్డులు లేవు’ అని అంటున్నారు. మేము ఎప్పటి నుంచో భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. మా గ్రామంలో మేము 12 ఎకరాలు సాగు చేస్తున్న విషయం అందరికీ తెలుసు. నాలుగు బోర్లు ఉన్నాయి. వరి, ఇతర పంటలు కూడా పండిస్తాము. మొత్తానికి పరిహారం ఇవ్వాలని మా నేత చుట్టూ తిరిగినా రికార్డుల్లో లేదని చెప్తూ, అసలే భూమి లేని వాళ్లకు మాత్రం డబ్బులు ఇస్తున్నాడు. కాస్తులో ఉన్నవారికి పరిహారం ఇవ్వొచ్చని చెప్తున్నా పట్టించుకోవడం లేదు.
– బోయిని బాబమ్మ, హకీంపేట