హైదరాబాద్ , ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రాథమిక, జిల్లా మత్స్య సహకార సంఘాలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సహకార సంఘాల చట్ట నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసి, కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ సంఘాలకు పర్సన్ ఇన్చార్జ్జులను, నామినేటెడ్ బాడీలను నియమించరాదని పేరొన్నది.
మత్స్యకార సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ జూలైలో సమర్పించిన వినతిపత్రంపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ములుగు జిల్లాకు చెందిన ఎస్ రఘుతో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ సూరేపల్లి నంద ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్లు సమర్పించిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకుని, చట్టప్రకారం ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.