దుమ్ముగూడెం, సెప్టెంబరు 18 : తెలంగాణ రాష్ర్టంలో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచి అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ర్ట సాధకుడు కేసీఆర్ కు బీఆర్ఎస్ గిరిజన విభాగం ఆధ్వర్యంలో దుమ్ముగూడెంలో క్షీరాభిషేకం నిర్వహించారు. రిజర్వేషన్ల పెంపు అమలుకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం దుమ్ముగూడెం మండల కేంద్రంలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్చార్జి మానె రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశారన్నారు. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో పాటు పోడు రైతులకు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను వర్తింపజేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని కొనియాడారు.
గిరిజనుల ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్య రంగాల్లో అవకాశాలను మెరుగుపరిచేందుకు కేసీఆర్ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన 6 శాతం గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి అమలు చేయడం ద్వారా గిరిజనుల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ పై ఉన్న అభిమానంతో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ కణితి రాముడు, కో-కన్వీనర్ ఎండీ జానీ పాషా, మాజీ ఎంపీపీ రేసు లక్ష్మి, నాయకులు తునికి కామేష్, అపక వీర్రాజు, వాగి ఖాదర్ బాబు, గుండి రవి, కోర్సా నరసింహారావు పాల్గొన్నారు.