– సీతారామపురంలో భారీ ధర్నా
దుమ్ముగూడెం, సెప్టెంబరు 18 : నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకే అధికార పార్టీలోకి వెళ్తున్నానని, నిధుల వరదతో ఏజెన్సీ ప్రాంత రూపురేఖలు మారుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. శుక్రవారం ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం సీతారామపురం గ్రామాల్లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు మానే రామకృష్ణ మాట్లాడుతూ.. భద్రాచలం నుండి వాజేడు వరకు ప్రధాన రహదారి అనేక ప్రాంతాల్లో గుంతలమయంగా మారినా కనీస మరమ్మతులు చేపట్టడం లేదని ఆరోపించారు. అత్యవసర వైద్యం కోసం రోగులు, గర్భిణులను తరలించేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే రహదారి పరిస్థితిపై ఎమ్మెల్యే స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా సమస్యల పరిష్కార వేదికగా కాకుండా కమీషన్ల వ్యవహారాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచరులు, పీఏలు అధికారులు, కాంట్రాక్టర్ల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గోదావరి తీర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోందని నాయకులు ఆరోపించారు. భారీ ఇసుక లారీల రాకపోకలతో అంతర్గత రహదారులు ధ్వంసమవుతున్నాయని, ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏజెన్సీ రైతులకు కీలకమైన తాలిపేరు ప్రాజెక్టు నిర్వహణపై కూడా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గేట్ల నిర్వహణ, కాలువల మరమ్మతులు సక్రమంగా లేకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందడం లేదని ఆరోపించారు.
ఫలితంగా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారని, తాలిపేరు కాలువలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు వరకు నీరందించాలని డిమాండ్ చేశారు. సుమారు గంటసేపు ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ధర్నా విరమించాలని కోరారు అయినప్పటికీ ధర్నా నిర్వహించడంతో భారీ వాహనాలను ములకపాడు వద్ద నుంచి పాలగూడెం మీదుగా భద్రాచలం వైపు తరలించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనరు కణితి రాముడు, కో కన్వీనరు ఎండీ జానీపాషా, మాజీ ఎంపీపీ లక్ష్మి, నాయకులు రావులపల్లి పృద్వీ, పార్టీ సీనియర్ నాయకులు అపకా వీరాజు, దామెర్ల శ్రీను, లంక శివ, కొత్తూరు సీతారామారావు, జోగా బుజ్జి, సర్పంచ్ వాగె ఖాదర్బాబు, వెంకటేశ్వరరావు, వాగి చిట్టు, సూర్య పాల్గొన్నారు.

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వైఖరిపై భగ్గుమన్న బీఆర్ఎస్ నాయకులు