– – డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ
అర్వపల్లి, సెప్టెంబర్ 18 : జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని కస్తూరిబాగాంధీ మహిళా బాలికల విద్యాలయం (కేజీబీవీ) నందు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం (DHEW) సంయుక్త ఆధ్వర్యంలో ‘బేటీ బచావో – బేటీ పడావో’ పథకంలో భాగంగా బాలికలకు పోషకాహార అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ అనూష మాట్లాడుతూ.. కౌమార దశలో బాలికలకు శారీరక మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఆడపిల్లల్లో రక్తహీనత (ఎనీమియా) అనేది చదువుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనిని అధిగమించడానికి ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఆకుకూరలు, పప్పుధాన్యాలు, బెల్లం, వేరుశనగలు, గుడ్లు వంటి బలవర్ధక ఆహారాన్ని ప్రతిరోజూ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సరైన పోషకాహారంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ఎలాంటి న్యూనతాభావం లేకుండా ఆత్మవిశ్వాసంతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె బాలికలకు ఉద్బోధించారు.
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ సంస్కృతి పెరిగిపోతోందని, విద్యార్థినులకు దూరంగా ఉండే సంప్రదాయం, పోషకాలున్న ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రమం తప్పకుండా వ్యాయామం, ఆటలాడటం అవసరమని. బాలికల విద్య, భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ‘బేటీ బచావో – బేటీ పడావో’ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను నిర్దేశించాలని సూచించారు.
జిల్లా కో-ఆర్డినేటర్ చైతన్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత బాలికల్లో రక్తహీనత నివారణే లక్ష్యంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల దశ నుంచే పోషకాహారంపై స్పృహ కలిగి ఉండాలని, ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా చేయాలని చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా బాలికల సంరక్షణ, సాధికారతకు నిరంతరం అండగా ఉంటామని ఆమె స్పష్టం చేశారు.సదస్సు అనంతరం పాఠశాల విద్యార్థులకు పోషకాహారంతో కూడిన న్యూట్రిషన్ కిట్లను అతిధుల చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారిణి (ఎస్ఓ) నాగరాణి, మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ వినోద్, భవ్య, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.