నిర్మల్, ఆగస్టు 15(నమస్తే తెలంగాణ) : ఉచిత రేషన్ బియ్యం పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. అయితే కార్డుదారుల్లో సరైన అవగాహన లేకపోవడం, బాధ్యతారాహిత్యం కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, పలుమార్లు గడువు పొడిగించినా ఆశించిన రీతిలో స్పందన కరువైంది. గత జూలై 31 వరకు విధించిన గడువు ముగిసేసరికి నిర్మల్ జిల్లాలో కేవలం 78 శాతం మాత్రమే నమోదు పూర్తయింది.
ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. నిర్మల్ జిల్లాలో 7,75,313 మంది లబ్ధిదారులు ఉండగా, గత నెల 31 నాటికి 6,08,520 (78శాతం) మంది ఈ కేవైసీ చేసుకున్నారు. ఇంకా 1,66,793 మంది నమోదు చేసుకోవాలి. గడువులోగా వీరు నమోదు చేసుకోకపోతే, రాబోయే రోజుల్లో రేషన్ కోటా నిలిచిపోయే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ కార్డులో పేరున్న ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా రేషన్ దుకాణానికి వెళ్లి బయోమెట్రిక్ ధ్రువీకరణతో ఈ-కేవైసీ పూర్తి చేయాలి. డీలర్ల వద్ద ఉండే ఈ-పాస్ మిషన్‌లో వేలిముద్ర వేసి ధ్రువీకరణ పూర్తి చేయాలి. చిన్న పిల్లలకు వేలిముద్రలు పడని పక్షంలో ఐరిస్(కంటిపాప) ఆధారంగా నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే ప్రభుత్వం లబ్ధిదారులందరికీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు చెబుతున్నారు.
అర్హులకే అందాలని..
రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యుల్లో కొందరు చనిపోయినా, మరికొందరు పెళ్లిళ్లు చేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్లిపోయినా ఆ వివరాలు తొలగించకుండా, కుటుంబ సభ్యులు ప్రతి నెల వారి పేరిట రేషన్ బియ్యం పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి అక్రమాలకు స్వస్తి చెప్పి, నిజమైన లబ్ధిదారులకే ఫలాలు అందేలా చూసేందుకే ఈ-కేవైసీ విధానాన్ని బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ-కేవైసీపై ఇప్పటికే అధికారులు గ్రామాలు, వార్డులవారీగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 31 తర్వాత గడువు పొడిగించే అవకాశం లేనందున, చివరి వరకు ఎదురు చూడకుండా వెంటనే తమ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు.
తద్వారా బియ్యం పంపిణీ నిలిచిపోకుండా చూసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఈ-కేవైసీ పేరుతో కేంద్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు. రేషన్ దుకాణాల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులందరూ ఒకే సారి రేషన్ షాపుకు రావాల్సి ఉండడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. నయా పైసా అదనంగా ఇవ్వకుండా తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని డీలర్లు మండిపడుతున్నారు. ఒకవైపు మూడు నెలల కోటా బియ్యం పంపిణీ, మరోవైపు ఈ-కేవైసీని పూర్తి చేయడం డీలర్లకు సవాల్‌గా మారింది. ఈ నెల 31లోగా కూడా 100 శాతం పూర్తి కావడం కష్టమేనని డీలర్లు చెబుతున్నారు.