కాంగ్రెస్ ప్రభుత్వం సున్నపురాయి గనుల లీజు ఈ-వేలంలో భాగంగా సుల్తాన్పూర్ రిజర్వు ఫారెస్టులో నాగార్జున సిమెంట్స్‌కు కట్టబెట్టిన మైనింగ్ ప్రాంతం చారిత్రక మట్టపల్లి ఆలయానికి దగ్గరలో ఉన్నదని ఆందోళన వ్యక్తమవుతున్నది. సాధారణ ప్రాంతాల్లోనే జనవాసాలకు మైనింగ్ ప్రాంతం కనీసం అర కిలోమీటర్ దూరంలో ఉండాలనే నిబంధన ఉన్నట్టు సమాచారం. చారిత్రక నిర్మాణాల విషయంలో ఈ నిబంధన మరింత కఠినంగా ఉంటుంది. కానీ గనులశాఖ రికార్డుల్లోని అక్షాంశాలు-రేఖాంశాల ద్వారా మైనింగ్ లీజు ప్రాంతాన్ని గూగుల్‌లో ఇంపోజ్ చేసి చూస్తే మట్టపల్లి చారిత్రక ఆలయానికి అర కిలోమీటర్ దూరంలోనే బ్లాకు సరిహద్దు ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో ఇంతటి కీలకమైన అంశాన్ని ఎలా మరిచారు? అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. దీంతోపాటు ఈ బ్లాకు మధ్యలో నుంచే తెలంగాణ-ఏపీ రాష్ర్టాలకు కృష్ణా నదిపై నుంచి అనుసంధానంగా ఉన్న తంగడ-మట్టపల్లి ప్రధాన రోడ్డు కూడా ఉండటం గమనార్హం.
డెక్కన్ సిమెంట్స్ అరాచకాలపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) దృష్టిసారించిన సంగతి తెలిసిందే. అయితే సరైన సమాచారం ఇవ్వలేదనే కారణంతో రాష్ట్ర గనులు, అటవీశాఖ అధికారులకు సీఈసీ నోటీసులు ఇచ్చి గతనెల 25న ఢిల్లీలో విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు, ఇంజినీర్ పసుపులేటి సురేశ్‌బాబు క్షేత్రస్థాయి విచారణ (ఫీల్డ్ ఎంక్వయిరీ) చేయించాలని సీఈసీని కోరారు. దీనికి సీఈసీ చైర్మన్ అనుమతిస్తూ ఫిర్యాదుదారు సమక్షంలోనే విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో విచారణ ఎప్పుడు చేపట్టనున్నారో తనకు అధికారికంగా సమాచారం ఇవ్వాలని సురేశ్‌బాబు గురువారం పీసీసీఎఫ్‌కు లేఖ రాశారు. అటవీశాఖ మంత్రి కొండా సురేఖను కూడా కలిసి ఈ లేఖను ఇవ్వడంతో, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని లేఖపై మంత్రి ఎండార్స్ చేశారు. ప్రధానంగా కేంద్ర సాధికారత కమిటీ సూచనలకు కట్టుబడి చర్యలు తీసుకోవాలని అందులో సూచించారు. క్షేత్రస్థాయి విచారణ తేదీని నిర్ణయించి.. కనీసం మూడు రోజుల ముందు తనకు సమాచారం ఇవ్వాల్సిందిగా సురేశ్‌బాబు తన లేఖలో కోరారు.