Supreme Court | సుప్రీంకోర్టు కేసుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చూసేవారికి అత్యవసర కేసుల విషయంలో చెప్పే కొన్ని మాటలు ఇక వినిపించవు. ఎందుకంటే ఆ సమయంలో కొన్ని మాటలను మ్యూట్ చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. దీంతో అత్యవసర కేసుల విచారణకు సంబంధించి చీఫ్ జస్టిస్ (CJI) ముందు లాయర్లు చేసే అభ్యర్థనలు, కోర్టు ఇచ్చే సమాధానాలు ప్రత్యక్ష ప్రసారంలో వినపడకుండా (Mute) చేస్తారు.
బుధవారం సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ముందు కొత్త విషయాలను ప్రస్తావిస్తున్నంతసేపు లైవ్లో ఆడియోను నిలిపివేశారు. ఉదయం కోర్టు చేసే పనుల్లో ‘మెన్షనింగ్ (Mentioning) అనేది ఒక భాగం. దీనిలో లాయర్లు సీజేఐని కేసులను అత్యవసరంగా విచారణ చేయాలని కోరతారు. కేసును బట్టి అత్యవసరమా కాదా అని విషయం సీజేఐ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈ సమయంలో విచారణ తేదీని ఖరారు చేసేటప్పుడు లేదా తిరస్కరించేటప్పుడు మౌఖికంగా వ్యాఖ్యలు చేస్తారు. ఇలాంటి వ్యాఖ్య ఇటీవల చర్చనీయాంశంగా మారింది. దీంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ఢిల్లీలో నిరసన చేపడుతున్న విద్యార్థులు, నిరసకారులపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యను సుమోటోగా తీసుకుని, అత్యవసర విచారణ చేపట్టాలని ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను వ్యతిరేకించే సమయంలో మా సమయం వృథా చేయకండి, మేము ఎలాంటి వీడియోలు చూడాలనుకోవడం లేదు అని సీజేఐ చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. దీంతో అత్యవసర విషయాలను ప్రస్తావించడమనేది ఒక పరిపాలనా చర్య. అది న్యాయపరమైన ప్రక్రియ కాదు. దీన్ని ప్రచురించడం కాని వ్యాప్తి చేయడం కాని చేయకూడదు అని సీజేఐ పేర్కొన్నారు.