మణికొండ, మార్చి 5 : ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ సర్కార్ ప్రజలను నిలువునా దోచుకుతింటున్నదని, అవినీతి, అక్రమాల్లో ఆరితేరుతున్నదని బీఆర్ఎస్ బృందం తీవ్రస్థాయిలో మండిపడింది. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం గురువారం శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలోని మానస హిల్స్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసింది. ఇక్కడ రాఘవ కన్స్ట్రక్షన్స్ అనుమతులు లేకుండా క్రషర్లు నిర్వహిస్తూ దందా కొనసాగిస్తున్నదని, సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి అనుయాయులు వేల కోట్లు వెనుకేసుకుంటున్నారని ఎండగట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, క్రిశాంక్, రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పీ కార్తీక్‌రెడ్డి కొత్వాల్‌గూడలో పర్యటించారు. గ్రామ సర్వే నంబర్లు 62, 63, 69లోని ఐదెకరాల ఎనిమిది గుంటల భూమిలో మంత్రి పొంగులేటి తనయుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ అనుమతి లేకుండా క్రషర్లు నిర్వహిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు.
క్రషర్లను చూస్తుంటే కేజీఎఫ్ సినిమా గుర్తుకొస్తున్నదని, ఎక్కడ పడితే అక్కడ దొంగలు అనుమతులు లేకుండా అక్రమ దందా సాగిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘భూమాతను చెరబట్టి అక్రమ మైనింగ్‌లు సినిమాల్లోనే చూశాం.. కానీ కొత్వాల్‌గూడలో మరో కేజీఎఫ్ సినిమాను ప్రత్యక్షంగా చూస్తున్నం. గుట్టలను పిండిచేసి గుట్టలు గుట్టల సొమ్మును దోచుకుపోతున్నరు’ అని ధ్వజమెత్తారు. స్టోన్ క్రషర్, రెడీమిక్స్ ప్లాంట్లు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని, కానీ అవేమీ లేకుండా మంత్రి పొంగులేటి తన అధికార బలంతో ఇక్కడ గుట్టలు చెరబట్టారని మండిపడ్డారు. ప్రకృతి, ప్రజల సొమ్మును దోచుకునే హక్కు పొంగులేటికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇవన్నీ ఏర్పాటు చేయాలంటే సీటీవో, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, గ్రామ పంచాయతీ ఎన్వోసీ, వాటర్ యుటిలైజేషన్, ఇండస్ట్రియల్ పర్మిషన్ ఉండాలని చెప్పారు. టీజీఎస్పీడీసీఎల్ నియమనిబంధనలు ఇక్కడ ఏవీ లేవని చెప్పారు. 1999లో మూతపడ్డ క్రషర్‌ను మళ్లీ ప్రారంభించాలంటే అన్ని అనుమతులు ఉండాలని, కానీ అవేవీ లేవని ఇక్కడి నిర్వాహకులు చెప్పారని వివరించారు. రేవంత్‌రెడ్డి దోపిడీకి తెలంగాణ రాష్ట్రం అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శబ్ద, పర్యావరణ కాలుష్యం పెచ్చుమీరుతున్నదని వాపోయారు. ఔటర్ రింగ్‌రోడ్డుకు, జీవో 111కు వ్యతిరేకంగా క్రషర్లు నిర్వహిస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమంగా ఎవరు క్రషర్లు నిర్వహించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
‘శంషాబాద్ మండలంలో కొత్త్తగా విద్యుత్ మీటర్లు, రిజిస్ట్రేషన్లు, ఓసీలు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ రెండు నెలల క్రితం ధర్నాలు చేస్తే మీరంతా జీవో 111 పరిధిలో ఉన్నరు.. అవన్నీ ఇవ్వడానికి వీలు కాదు అని అధికారులు చెప్పిండ్రు. మూసీకి ఇరువైపులా బఫర్ జోన్లో ఉన్న ఇండ్లను కూల్చుతామని నోటీసులు ఇచ్చిండ్రు. మరి ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా క్రషర్లు నడుపుతుంటే హైడ్రాకు కన్పించడం లేదా?’ అంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పీ కార్తీక్‌రెడ్డి ప్రశ్నించారు. జీవో 111 కేవలం పేదలకే తప్ప పెద్దలకు వర్తించదా? అని నిలదీశారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల అక్రమా లు పెచ్చుమీరాయని మండిపడ్డారు. అక్రమ క్రషర్లను తక్షణమే మూసివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘కాంగ్రెస్ అంటేనే కరప్షన్’ అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ‘నిబంధనలకు విరుద్ధంగా క్రషర్లు నడుపుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎక్కడికి పోయింది? జీహెచ్ఎంసీ, రెవెన్యూ అనుమతులు ఏవి? మైనింగ్ శాఖ ఎక్కడ ఉన్నది?’ అని నిప్పులు చెరిగారు. వేలకోట్ల విలువైన సహజవనరులను కొల్లగొట్టి సొమ్ముచేసుకుంటున్న రాఘవ కన్స్స్ట్రక్షన్స్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దళితుల భూముల్లో క్రషర్లు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కొత్వాల్‌గూడలో అక్రమంగా కొనసాగుతున్న క్రషర్లపై క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ బృందం వస్తున్నదని తెలిసి రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ రాత్రికిరాత్రి పేరు ఉన్న కంటెయినర్‌కు రంగు వేసిందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్ పేరు దాచి పెట్టగలరేమో గానీ కొండను దాచి పెట్టలేరంటూ మండిపడ్డారు. ‘నువ్వు ఎన్ని కొండలనైనా కొట్టుకో.. ప్రభుత్వం మనదే’నంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన కొడుకు రాఘవ కన్స్ట్రక్షన్కు అప్పజెప్పారు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మానస హిల్స్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా కొండలను పిండిచేస్తున్న మంత్రి పొంగులేటి సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ దోపిడీకి తెలంగాణ రాష్ట్రం ప్రయోగశాలగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. చట్టాన్ని ఉల్లంఘించి యథేచ్ఛగా అక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రామాల్లోని వాగుల నుంచి ఇసుక తోడినా కేసులు నమోదు చేస్తారని, ప్రైవేట్ భూముల నుంచి మొరం తీసినా చర్యలు తీసుకుంటారని, అలాంటిది అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సమీపంలో అక్రమ క్రషర్ల దందా చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.
శంషాబాద్‌లో పేదలు ఇండ్లు నిర్మించుకుంటే అనుమతులు లేవని చెప్పి జీవో 111 అంటూ హైడ్రాను తీసుకొచ్చి రెవెన్యూ అధికారులు కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి పొంగులేటి తనయుడి రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట 33 ప్రాంతాల్లో ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారని, ఈ నిర్మాణాలన్నీంటికీ ఇక్కడి క్రషర్ల ద్వారా కంకర తరలిస్తున్నారని విమర్శించారు. ఇదంతా చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా అని ప్రశ్నించారు. ఎమ్మార్వో, మైనింగ్ అధికారులు ఎక్కడ? అంటూ నిలదీశారు. ‘ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 25 ఏండ్లుగా ప్రభుత్వ భూదాన్ భూమిలో 60, 80 గజాల్ల్లో పేదలు కట్టుకున్న ఇండ్ల్లు కూల్చేసిండ్రు. పైగా వాళ్లను పెయిడ్ బ్యాచ్, ల్యాండ్ మాఫియా అని మంత్రి పొంగులేటి అన్నరు.
నిజానికి ఎవరు పెయిడ్ మాఫియా? మీ అధికారులు, మీ నాయకులు, మీరు కాదా?’ అని సూటిగా ప్రశ్నించారు. పొంగులేటికి మంత్రి పదవిలో కొనసాగే హక్కులేదని హెచ్చరించారు. ‘ఈడీ అధికారులు, బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కావడం వల్లే 2024లో లగ్జరీ వాచ్‌ల కుంభకోణం కేసు బయట పడలేదు’ అని ఆరోపించారు. ‘అక్రమాలను వెలుగులోకి తెచ్చే మీడియా వాళ్లకు అనుమతులున్నాయా? అని స్థానిక పోలీసులు ప్రశ్నిస్తున్నరు. ప్రైవేట్ భూములైతే అనుమతులను పరిశీలించరా?’ అంటూ నిలదీశారు. వట్టినాగులపల్లిలో రూ.300 కోట్ల విలువజేసే భూమిని మంత్రి పొంగులేటి కుమారుడు ఆక్రమించాడని గుర్తుచేశారు.