BRS party| జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సభా ఏర్పాట్ల కోసం మోతె రోడ్డు పక్కన గల స్థలాన్ని జీవన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, తుల ఉమ, విద్యాసాగర్‌రావు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటినీ కూడా నెరవేర్చలేదన్నారు. జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు. జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు.
జగిత్యాల సభను భారీగా నిర్వహించనున్నట్లు కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, లక్ష మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

