దశాబ్దాలుగా భూ సమస్యలతో ఆగమైన రైతులకు ‘ధరణి’ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా.. ఎవరిని బతిమిలాడే బాధలేకుండ.. ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నది. ఏండ్లకేండ్లు.. నెలలకు నెలలు ఆఫీసుల పొంటి తిరిగినా కాని పని.. కూర్చున్న చోటనే పూర్తవుతున్నది. అరగంటలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిసి, అప్పటికప్పుడే మ్యుటేషన్, పట్టా బుక్కు చేతిలో పెట్టి ఇంటికి పంపుతుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. శనివారం ‘నమస్తే తెలంగాణ’ కరీంనగర్ జిల్లాలోని పలు తహసీల్ ఆఫీస్‌లను సందర్శించగా, ఇది ‘ధరణి కాదు.. కేసీఆర్ సారు మాకు ఇచ్చిన బంగారు భరిణి’ అని కర్షకలోకం సంబురపడుతున్నది.
– కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ)
నాడు రిజిస్ట్రేషన్ వ్యవస్థ దళారుల చేతుల్లో ఉండేది. చిన్న రిజిస్ట్రేషన్‌కు కూడా వారినే ఆశ్రయించాల్సి వచ్చేది. చివరకు కార్యాలయంలో ఏ చిన్న సర్టిఫికెట్ కావాలన్నా వారి ప్రమేయం లేకుండా వచ్చేది కాదు. పైగా ఎంత చెబితే అంత అన్నట్టుగా నడిచేది. నేరుగా అధికారులను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి ఉండేది కాదు. కానీ, రాష్ట్ర ఏర్పాటు తర్వాత రిజిస్ట్రేషన్ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా మారింది. 2020 నవంబర్ 2 నుంచి జిల్లాల్లో అమల్లోకి వచ్చిన ‘ధరణి పోర్టల్’ అనేక మార్పులు తీసుకొచ్చింది.
కరీంనగర్, మే 27 (నమస్తే తెలంగాణ) : భూ వివాదాలకు చెక్ పెట్టి, వ్యవసాయ భూములకు భద్రత కల్పించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు. అక్టోబర్ 29న మల్కాజ్గిరి జిల్లా మూడుచితంలపల్లి వేదికగా శ్రీకారం చుట్టారు. 2020 నవంబర్ 2 నుంచి జిల్లాల్లో అమల్లోకి తెచ్చారు. ధరణి పోర్టల్ రాకతో రైతుల భూములన్నీ తహసీల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. రైతులు చేయాల్సిందల్లా మీ సేవా కేంద్రాల వద్దకు వెళ్లి ఆన్లైన్లో సంబంధిత ఆస్తి, భూమి విలువ నమోదు చేయగానే మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ ఫీజు తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. ఈ మొత్తాన్ని చెల్లించిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటే, కొనుగోలుదారులు అందించిన వివరాల మేరకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కంప్యూటర్లోనే జనరేట్ అవుతాయి. దీనికి స్టాంప్ పేపర్ కూడా అవసరం లేదు. రిజిస్ట్రేషన్ కోసం తహసీల్ ఆఫీస్‌కు వెళ్లగానే.. మీసేవలో ఇచ్చిన పత్రాలను తహసీల్దార్ కం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తారు. అమ్మకందారు, కొనుగోలుదారు, ఇద్దరు సాక్షుల సంతకాలు, ఫొటోలు తీసుకుని అరగంటలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ ముగిస్తారు. కేవలం ప్రభుత్వానికి చెల్లించే ఫీజు మినహా దళారుల ప్రమేయం ఎక్కడా కనిపించదు. తక్కువ సమయం, తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్లు అవుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
భూములకు పూర్తి భద్రత
ధరణి పోర్టల్‌ను ప్రవేశ పెట్టిన తర్వాత రైతుల భూములకు పూర్తి భద్రత ఏర్పడింది. ఈ విషయాన్ని రైతులు కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఒకప్పుడు వీఆర్వోలు, తహసీల్దార్ల చేతిలో ఉన్న రెవెన్యూ దస్ర్తాల్లో వాళ్లు రాసిందే రాత, గీసిందే గీత అన్నట్లు ఉండేది. ఇప్పుడు ధరణితో పూర్తి పారదర్శకత ఏర్పడింది. భూమి హక్కు పత్రాలను ట్యాంపరింగ్ చేయడంగానీ, తారుమారు చేయడంగానీ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అంత పకడ్బందీగా భూ రికార్డుల వ్యవస్థను రాష్ట్ర సర్కారు తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ వ్యవస్థపై రైతులకు పూర్తి విశ్వాసం కలిగింది. చిన్న చిన్న తప్పుల సవరణకు కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాడ్యూల్స్‌ను యాడ్ చేస్తున్నది. ధరణి పోర్టల్ ఆవిష్కరించినప్పటి నుంచి ఇప్పటి వరకు 31 కొత్త మాడ్యుల్స్‌ను యాడ్ చేసింది. దీంతో రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలపై ఎప్పటికప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. కలెక్టర్ కార్యాలయంలో పరిశీలన జరిపి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. విస్తీర్ణం తక్కువ ఉన్నా, పేర్లు, ఆధార్ నంబర్లు తప్పుగా ఉన్నా, సర్వే నంబర్లు తప్పుగా నమోదైనా రైతులు ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను బట్టి వెంట వెంటనే పరిష్కరిస్తున్నారు.
రైతుల్లో అవగాహన
ధరణి పోర్టల్‌పై శనివారం కరీంనగర్, కొత్తపల్లి తహసీల్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు జరిగిన సమయంలో రైతులను కదిలించిగా, ఎంతో అవగాహనతో అనేక విషయాలు చెప్పారు. నాడు రిజిస్ట్రేషన్లలో జరిగే అవకతవకలే కాకుండా మ్యుటేషన్లు ఏ విధంగా జరిగేవి, రెవెన్యూ అధికారులు ఏ విధంగా తప్పులు చేసేవాళ్లనేది పూసగుచ్చినట్లు వివరించారు. రైతుల పేర్లు సేత్వార్‌లో ఉంటే పహాణీలో ఉండేవి కాదని, మోకాపై ఉంటే పట్టాకు ఉండేవారు కాదని, ఒకరి భూమి మరొకరికి పట్టా చేసేవారని, ఉన్న భూమిని తక్కువ చేసి చూపించేవారని, సర్వే నంబర్లు తప్పుగా వేసేవారని చెప్పారు. ఈ విషయమై కరీంనగర్ మండలం బొమ్మకల్, కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌కు చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ, వాళ్లు చేసిన తప్పులు సరిచేయాలన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకునేవారు కాదని, ఏండ్ల తరబడి తిప్పించుకుని అరిగోస పెట్టేవారని గుర్తు చేశారు. ధరణి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు లేవని, అన్ని ఆన్లైన్లో చూసుకోవచ్చని, రైతుకు తెలియకుండా ఎవరైనా రికార్డులు మార్చే ప్రయత్నం చేస్తే సంబంధిత రైతు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వస్తుందనే విషయాన్ని ప్రస్తావించారు. ధరణి పోర్టల్‌పై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన పెరుగుతున్నదని చెప్పడానికి ఇది నిదర్శంగా చెప్పవచ్చు.
పావుగంటలోనే పనైంది
మా ఊరు ఖాజీపూర్ గ్రామ శివార్ల 14 గుంటల ఎవుసపు భూమి కొన్న. ఈ నెల 26న మీ సేవలో స్లాట్ బుక్ చేసుకున్న. శనివారం మధ్యాహ్నం కొత్తపల్లి తహసీల్ ఆఫీసులో రిజిస్ట్రేషన్‌కు టైం ఇచ్చిన్రు. విక్రయదారు ఐలవానిపల్లికి చెందిన రాజవ్వతో కలిసి ఆఫీసుకు వచ్చిన. పావుగంటలనే రిజిస్ట్రేషన్ చేసుకున్న. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాయితాలు రెండూ ఒకటే సారి ఇచ్చిన్రు. మస్తు ఈజీగా రిజిస్ట్రేషన్ అయింది. కానీ, ఇంతకుముందు గిట్లుండకపోయేదట. ఫస్ట్ బ్రోకర్ల దగ్గరికి, అటెన్కనే రిజిస్ట్రేషన్ ఆఫీసుకు పొయ్యేదట. ఇదేదో పండుగ అయినట్లు గుంపులకు గుంపులు పెద్ద మనుషులు వచ్చేదట. ఖర్సు కూడా బాగా అయ్యేదట. అయినా రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ కోసం రైతులు ఇబ్బంది పడేదట. ఎక్కడికి పోవల్నో, ఎవల్ని కలువాల్నో తెల్వక ఆగమయ్యేదట. ఇప్పడా కష్టాల్లేవు. ఆ పెద్ద సార్లతోనే రెండు పనులు ఒక్కదగ్గర్నే అయిపోయేతట్టు చేసిన్రు. ఎన్కటిలెక్క బ్రోకర్లు లేరు. పెద్ద మనుషులు లేరు. రైతులకు అదనపు ఖర్సులు లేవు. నేను భూమి మార్కెట్ విలువ ప్రకారం స్లాట్ బుకింగ్ సమయంలోనే మీసేవల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వలె. ఎంతో ఆలోచన చేసి సీఎం కేసీఆర్ సారు తెచ్చిన ధరణి రైతుకు వరంలాంటింది.
– ఎనుగుల రాజశేఖర్, ఖాజీపూర్ (కొత్తపల్లి మండలం)
భూమి పదిలం
ధరణి పోర్టల్‌తోనే భూమి పదిలంగా ఉంటుంది. రికార్డులు తారుమారు కాకుండా ఉంటాయి. పట్టా మార్పిడి రైతుకు తెలువకుండా జరుగదు. భూ రికార్డులు ఆన్లైన్ కాక ముందు ఇష్టమొచ్చినట్లు మారిన సందర్భాలు బోలెడున్నాయి. పహాణీలు ఇతర భూమి పత్రాలు ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అదే ధరణి లేకుంటే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లరిగేవి. ధరణిపై కొందరు చేసే రాద్ధాంతాలు పనికిమాలినవి. రైతులకు ధరణి చాలా ఉపయోగంగా ఉన్నది.
– కాసం రఘుపతిరెడ్డి, కందుగుల(హుజూరాబాద్)
ఏడేండ్ల గోస దీరింది
కొంత మంది అధికారుల చేతివాటంతో మాకున్న ఐదున్నరెకరాల భూమి వేరే వాళ్ల పేరు మీదికి మారి మా బతుకులు రోడ్డు మీద పడ్డయి. భూమి దున్నుకొని బతుకుతున్నం గానీ మా పేరు మీద ఆ భూమి లేక ఎన్నో తంటాలు పడ్డం. మా నాన్న చనిపోయినంక పట్టాదారు పాస్‌బుక్ చూసిన అండ్ల 20 గుంటలే ఉన్నది. మిగతా ఐదున్నరెకరాలు పాస్బుక్ల ఎక్కలేదని వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో, ఆఖరుకు కలెక్టర్ కార్యాలయానికి కూడా పోయిన. ఏడేండ్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగీ తిరిగీ కాళ్లకున్న చెప్పులు అరిగినయి గానీ పనిగాలేదు. చెప్పుకునే దిక్కులేక కన్నీళ్లు దిగమింగినం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అచ్చినంక సీఎం కేసీఆర్ సారు మాలాంటోళ్ల బాధలు దీర్చడానికి ధరణి తీసుకచ్చిండు. మండల కేంద్రంలోని తహసీల్కార్యాలయానికి పోయి దరఖాస్తు చేసుకున్నం. మా భూమి మాకు పట్టాదారు పాస్బుక్ల ఎక్కింది. భూమిని నమ్ముకొని బతికే మాకు ధరణితో మర్సిపోలేని మేలు జరిగింది.
– పూదరి రమేశ్‌గౌడ్, కోర్కళ్ (వీణవంక)
ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది
ధరణితో రైతులకు భూ సమస్యలు తగ్గినయ్. నాకున్న నాలుగెకరాల భూమిని నా పేరున, నా భార్య లక్ష్మి పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్న. వెంటనే కంప్యూటర్లో నా పేరు, నా భార్య పేరు ఎక్కినయ్. దుర్శేడ్ మీ సేవల పహాణి తీపిస్తే ఇద్దరి పేరున రెండెకరాల చొప్పున సర్వే నంబర్ల భూమి ఉన్నది. పట్టాదారు పాస్‌బుక్కులు రెండు పోస్టుల వచ్చినయ్. ధరణి రాక ముందు పహాణి కోసం నానా తంటాలు పడేటోళ్లం. పట్వారీ చుట్టూ తిరగాల్సి వచ్చేది. పాసుబుక్‌ల, పహాణీలో తేడా వచ్చేది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయంగనే పహాణి తీసిన వెంటనే నా పేరు, నా భార్య పేరు వచ్చింది. ఇప్పటి వరకు ఇంత తొందరగ నాకు పాస్బుక్కు రాలే. ఆఫీసుల చుట్టూ, పట్వారి చుట్టూ తిరుగుడు తప్పింది. నాపేరు మీద నా భూమి ఉందన్న నమ్మకం కల్గుతంది. ఒకప్పుడు పట్వారీ రాసే రాతల సక్కగ పేరు కనిపించక ఇబ్బంది పడేది. ఆ రోజులు గుర్తుకు రావద్దు.
– గాలిపెల్లి రాజలింగయ్య, చేగుర్తి (కరీంనగర్‌రూరల్)
గింత తొందరగ పనైతదనుకోలె..
మా నాయిన పిట్టల మల్లయ్య పేరున మానకొండూర్ మండలం గంగిపల్లి శివారుల సర్వే నెంబర్ 882/ఏ/2లో 2 ఎకరాల 9 గుంటల ఎవుసం భూమి ఉంది. ఇంకో సర్వే నెంబర్ల 6 గుంటల భూమున్నది. కానీ, మా నాయిన రెండేండ్ల కింద చనిపోయిండు. కానీ, ఆ భూమి కొత్త పాసు పుస్తకంల ఎక్కలేదు. పోయిన సంవత్సరం నవంబర్ నెలల కలెక్టర్ సారుకు దరఖాస్తు చేసుకున్న. తహసీల్దార్ ఆఫీసు నుంచి ఎంక్వైరీ చేసుకొని మా ఇంట్లోళ్లందరినీ రమ్మని అంగీకారం తెలుసుకున్నరు. ఫైల్ ఓకే అయినంక స్లాట్ బుక్ చేసుకున్న. శుక్రారం నేను, మా ఇంట్లోళ్లందరం వచ్చినం. ధరణిల విరాసత్ (సక్సేషన్) చేసుకున్న వెంటనే నా పేరున 2 ఎకరాల 9 గుంటలకు పాసు పుస్తకం ఇచ్చిన్రు. గింత తొందరగ పనైతదనుకోలె. అప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జమాబంధీ అయ్యేదాక చానా ఇబ్బందులుండేవి. కానీ, గిట్ల వచ్చి ఫొటోలు దిగి, వేలి ముద్రలు పెట్టి సంతకాలు చేసుకొని అప్పటికప్పుడే పాసు పుస్తకం ఇచ్చిన చరిత్ర ఎప్పుడూ చూడలే.
– పిట్టల రవి, రైతు, గంగిపల్లి(మానకొండూర్రూరల్)
భూ సమస్యలకు ధరణితో చెక్
ధరణి పోర్టల్‌తో రైతుల సమస్యలకు చెక్ పెట్టినట్లయింది. నేను ఇటీవల కొత్తగా వ్యవసాయ భూమి కొన్న. ఆ తర్వాత వెంటనే ధరణిల రిజిస్ట్రేషన్ చేసుకున్న. ఆరోజే డాక్యుమెంట్లు ఇచ్చిన్రు. వెంటనే ఆన్లైన్ చేసిన్రు. దీంతో పూర్తి పని ఒకేరోజు అయిపోయింది. గతంలో అయితే పహాణీ కోసమే రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ చేసిన తరువాత పది రోజులకు మ్యుటేషన్ చేసుకోవాల్సి వచ్చేది. దానికోసం రెవెన్యూ సిబ్బందితో నానా తంటాలు పడేది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆన్లైన్లో చేయడం వల్ల చాలా ఇబ్బందుల నుంచి రైతులు బయట పడుతున్నరు. మీ సేవ ద్వారా ఆన్లైన్లో పహాణి వెంటనే వస్తున్నది. భూ యజమాని నుంచి కొన్న వారి సర్వే నంబర్ నుంచి వెంటనే బదలాయింపు జరుగుతున్నది. ఇలా చేయడం వల్ల రైతులకు శ్రమ తప్పుతది. రిజిస్ట్రేషన్ పనులు సులభంగా అయితయ్.
– కాంరెడ్డి తిరుపతిరెడ్డి, బొమ్మకల్ (కరీంనగర్‌రూరల్)
అరగంటల్నే పనైంది
నేను ఇటీవల్నే మా ఊరి రైతు పిట్టల లచ్చయ్య దగ్గర ముంజంపల్లి గ్రామ శివారులోని 17.50 గుంటల వ్యవసాయ భూమి కొన్న. రెండు రోజుల కింద స్లాట్ బుక్ చేసుకున్న. నాకు ఇది వరకే 17.50 గుంటలకు పాసు పుస్తకం ఉండె. మల్ల ఇప్పుడు మా ముంజంపల్లిలోని సర్వే నెంబర్లు 199బీ/2లో 13 గుంటలు, 199ఏ/1లో 4.50 గుంటలు మొత్తం కొన్న భూమి 17.50 గుంటలకు శుక్రవారం తహసీల్దార్ ఆఫీసుల రిజిస్ట్రేషన్ చేసుకున్న. డాక్యుమెంట్ ఇచ్చిన్రు. నాకున్న పాసు పుస్తకంల నమోదు చేసి అరగంటల్నే ఇచ్చిన్రు. పాతది, కొన్న భూమి కలిసి మొత్తం 35 గుంటలకు రికార్డు అప్పడిప్పుడే నమోదైంది. అప్పట్ల పట్వారీల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేది. లీడర్లతోటి పైరవీలు చేయాల్సి వచ్చేది. మళ్లీ పాత పహాణిల ఉన్నది నమోదైందో లేదో ఎనుకులాడే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు గా తిప్పల తప్పింది.
– కుంట మల్లేశం, రైతు, ముంజంపల్లి (మానకొండూర్రూరల్)
ధరణి చాలా ట్రాన్స్‌ఫరెన్స్‌గా ఉంది
ధరణి పోర్టల్ మొదటి నుంచి చాలా ట్రాన్స్‌ఫరెన్స్‌గా పనిచేస్తోంది. ఎక్కడా దాపరికం ఉండదు. ఎవరి భూమికి సంబంధించిన వివరాలైనా ఏ సమయంలోనైనా ఎక్కడినుంచైనా చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు ఒక్కచోటే ఒకేసారి పావు గంటలో చేసి ఇస్తున్నం. రైతులు చాలా సంతోషంగా వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. అంతేకాకుండా గతంలో ధరణి పోర్టల్‌లో కేవలం రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు మాత్రమే ఆప్షన్స్ ఉండేవి. ఇప్పుడు 31 మాడ్యుల్స్ యాడ్ చేశారు. వీటితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకునే అవకాశం ఏర్పడింది. రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ మాడ్యుల్స్‌ను యాడ్ చేసింది. ధరణిలో ఇప్పుడు ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేవలం పావు గంటలో పూర్తి చేస్తున్నాం. కొత్తపల్లి మండలంలో రోజుకు పది లోపు స్లాట్ బుకింగ్స్ ఉంటున్నాయి. ఇవన్నీ రెండు గంటల్లో పూర్తి చేస్తున్నాం. ఎక్కడా ఏ పొరపాటు జరుకుండా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. విక్రయదారుల పట్టాదారు పాసు పుస్తకం నుంచి కొనుగోలుదారుల పాసు పుస్తకంలోకి ఆటోమెటిక్‌గా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటి ఆప్షన్స్ ధరణి పోర్టల్‌లో కనిపిస్తాయి.
– వెంకట్‌రెడ్డి, ( తహసీల్దార్, కొత్తపల్లి)
మునుపటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది
మునుపు ఎవలన్నా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కాగితాలు ఏ యాడాదికో, ఆర్నెళ్లకో వచ్చేటియి. ఎన్ని సార్ల వోయినా మళ్లోరోజు రమ్మనెటోళ్లు. తిర్గలేక యాస్టకచ్చేది. పైసలు తీస్కుని కూడా పనిచెయ్యకపోదురు. ఆ సారుకాడికి పోతే ఈసారు లేడందురు. ఈసారు కాడికి పోతే ఆసారు లేడందురు. తిర్గితిర్గి యాస్టకచ్చి చచ్చుడా బతుకుడా అనిపిచ్చేది. పెద్ద సార్లకు చెప్పినా పట్టించుకునెటోళ్లుగాదు. ఎందుకో వాళ్లకట్ల అలువాటైంది. ఇప్పుడు అట్ల లేదు. నా భర్త చనిపోతే మా మామ పేరు మీద ఉన్న భూమిని మా బావ, నేను ఇయ్యాళ్ల రిజిస్ట్రేషన్ చేయించుకున్నం. ఒక్కటే రోజుల అంతా 25 నిమిషాలల్ల రెండు పనులు అయిపోయినయ్. తైసిల్ద్ధార్ రెండు కాయితాలు చేతిలవెట్టి పంపిండు. కేసీఆర్ సారు చేసిన మంచి పనికి చేతులెత్తి మొక్కుతున్న. ఇట్ల లేకుంటే మా పని అయ్యేటిది కాదు. రూపాయి లంచం ఇచ్చే స్థోమత మాతాన లేదు. ఇప్పుడు ఆఫీసులల్ల సుతం పైసలు అడుగత లేరు. గవర్నమెంట్ మంచిగుంటే పనులు చేసే అధికారులు అట్లనే ఉంటరు. భూముల రిజిస్ట్రేషన్ కాడ ఫీసు కట్టుడు తప్పితే ఒక్కలు సుతం పైసలు అడగుత లేరు.. చానా సంతోషం అనిపించింది.
– పురమల్ల మౌనిక, బొమ్మకల్ (కరీంనగర్)
ఎన్కట సాదాబైనామ చేయించుకునెటోళ్లు
సీఎం కేసీఆర్ సార్ చేసిన ఈ మంచి పనికి రైతులు చానా సంతోష పడుతున్నరు. గతంల చానా మంది రిజిస్ట్రేషన్లకు భయపడి సాదాబైనామాలు రాసుకునెటోళ్లు. అడ్డగోలు పైసలు ఖర్సువెట్టుడయ్యేది. మీదికెళ్లి లంచాలు పెట్టాల్నని రైతులు భయపడెటోళ్లు. ఒక పసలుకు భూమి కొని రెండు మూడు పసల్లకు రిజిస్ట్రేషన్ చేయించుకునెటోళ్లు. ఎందుకంటే అప్పుడు ఖర్చు అట్లుండేటిది. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ అంటే సంతోషంగ చేయించుకుంటున్నరు. ఇప్పుడు ఒక్క రూపాయి ఖర్చయ్యేది లేదు. సాచ్చం రమ్మంటే సుతం వస్తున్నరు. తైసిల్ ఆఫీసుల అరగంటకు మించి ఉంటలేరు. మళ్ల ఇంటికి వచ్చి పనులు చేసుకుంటున్నరు. నా పేరు మీద ఉన్న భూమిని ఇయ్యాళ మా పెద్ద కొడుక్కు, చిన్న కోడలుకు రిజిస్ట్రేషన్ చేయించిన. ఒక్క రూపాయి సుతం ఎక్కువ ఖర్సుకాలే. చానా మంచిగనిపించింది. ఎప్పటికీ ఇట్లనే ఉండాలె. నా పేరు మీదికెళ్లి వాళ్ల పేరు మీదికి అరగంటలనే భూమి తాబదలయ్యింది. ఎన్కట ఆఫీసుల పొంటి తిర్గి తిర్గి సచ్చేది. ఇప్పుడు నా అసోంటి రైతులు చానా సంతోషంగ ఉన్నరు. ఇగ నా పేరు మీద ఎసోంటి భూమి లేదుగాని ఎవలన్నా వచ్చినపుడు ఎప్పటికి ఇట్లనే జరగాలె.
– పురమల్ల ఆంజనేయులు, బొమ్మకల్ (కరీంనగర్)
పహాణిలు ఈజీగా తీసుకోవచ్చు
ధరణి రాకముందు పహాణి, 1బీ, ఇతర భూమి పత్రాలు తీసుకోవాలంటే చాలా ఇబ్బందయ్యేది. వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతయ్. పత్రాల కోసం రోజుల తరబడి తహసీల్ కార్యాలయం చుట్టూ తిరిగినా కనికరించే వాళ్లు కాదు. నాకు ఎకరా 5 గుంటల వ్యవసాయ భూమి ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన కాక ముందు నా పేరు మీద 16 గుంటల భూమి ఉండె. ధరణి కోసం అధికారులు నా ఇంటికి వచ్చి నా పేరు మీద పట్టా మార్పిడి చేసిన్రు. ధరణి రాక ముందు నా పేరు రాజమొగిలి బదులు రాజమౌళి ఉండేది. ఈ పేరు మార్పిడి చేయాలని కొన్నేళ్లసంది అధికారుల చుట్టూ తిరిగినా పని చేయలేదు. ధరణి వచ్చినంక దరఖాస్తు పెట్టుకున్న వెంటనే పేరు మార్పిడి చేసిన్రు. ధరణితో భూ రికార్డులు సురక్షితంగా ఉంటయ్.
– సుంకరి రాజమొగిలి, రంగాపూర్(హుజూరాబాద్)