మక్తల్ : ఇందిరా మహిళా శక్తిలో భాగంగా మక్తల్ ( Maktal ) పట్టణంలో మహిళలకు శనివారం ఇందిరమ్మ చీరలను (Indiramma Sarees) రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి( Minister Vakiti Srihari) పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు.
ప్రభుత్వం మహిళలను నాణ్యమైన చీరలు అందజేస్తుం దన్నారు. ప్రధానమంత్రిగా ఇందిరమ్మ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా, రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. హాస్టల్ పిల్లలకు డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలను పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని అన్నారు. డిసెంబర్ ఒకటిన రూ.4,500 కోట్ల బడ్జెట్తో మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని వివరించారు.
మక్తల్- నారాయణపేట 4 లేన్ ల రహదారికి, నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తదితరులు పాల్గొన్నారు .