హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): గిరికొత్తపల్లి ప్రస్తుత రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఓ గ్రామం. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలంలో ఉండేది. ఆ ఊరిలో వందలాది ఎకరాల భూములతోపాటు భూగర్భజలాలకు గొలుసుకట్టు చెరువులే ఆధారం. వాటిపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్నుపడటంతో చెరువులు మాయం కావడం మొదలైంది. ఈ అరాచకాన్ని అడ్డుకొనేందుకు గ్రామానికి చెందిన గోలకొండ శ్రీనివాస్ అనే యువకుడి ఆధ్వర్యంలో కొందరు రైతులు రైతు సంఘంగా ఏర్పాటయ్యారు. చెరువులు రియల్ వ్యాపారుల వశం కాకుండా ఉండేందుకు ఐదేండ్ల క్రితం ఏకంగా పోరాటమే మొదలుపెట్టారు. అప్పటికే రియల్ వ్యాపారుల చేతుల్లోకి పోయిన రంగసముద్రం చెరువును ‘నమస్తే తెలంగాణ’ సహకారంతో ఆ రైతులు కాపాడుకొన్నారు.
మరొకటైన తుమ్మలకుంట చెరువునూ కాపాడేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇంకేముంది.. గ్రామంలోని చెరువు భూములను అమ్ముకోకుండా అడ్డుపడుతున్నారంటూ గ్రామానికి చెందిన గోలకొండ శ్రీనివాస్ కుటుంబంపై అనుముల కుటుంబీకులు, కాంగ్రెస్ నేతలు కక్షగట్టారు. దాడులకు దిగుతూ, బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధిత కుటుంబం బిక్కుబిక్కుమంటూ గడుపుత్నుది. ఇటీవల నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగుచూసిన కుమ్మెర ఘటనతో ఈ దురాగతాన్ని సైతం బయటపెట్టేందుకు తాజాగా బాధితులు ‘నమస్తే తెలంగాణ’ను ఆశ్రయించి తమ గోడు వెల్లబోసుకున్నారు.
రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలోని గిరికొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ నేతల అరాచకానికి అడ్డూఅదుపు లేకుండాపోయింది. హైదరాబాద్ నగరానికి చేరువలో ఉండటంతో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ రంగం విస్తరించింది. ఈ ప్రభావం గ్రామంలోని చెరువులపై పడింది. ఎగువ నుంచి వచ్చే వరదను ఒడిసిపట్టేందుకు గ్రామ పరిధిలో రంగసముద్రం, తమ్ములకుంట, పీర్లకుంట, రైవ్యాకులం కుంట, కుమ్మరికుంట, చాకలికుంట వంటి గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలో శిఖం పట్టాలు, ఏక్‌సాల్ పట్టా భూములు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం చెరువుల్లో నీళ్లు లేనపుడు అందులో వ్యవసాయం చేసుకోవడం మినహా ఎలాంటి నిర్మాణాలు గానీ, వ్యాపార కార్యకలాపాలు గానీ చేపట్టేందుకు వీలులేదు. అయినా ఇతర ప్రాంతాల్లో ఉండే పట్టాదారులు వాటిని అమ్మేందుకు ప్రయత్నించారు. ఇందుకు గాను చెరువుల్లోకి నీళ్లు రాకుండా ఫీడర్ చానళ్లు, కత్వాలను ధ్వంసం చేశారు. మట్టితో చెరువులను నింపడంతో అవి వట్టిపోవడం మొదలైంది. చెరువులు లేకపోతే గ్రామంలో కనీసం భూగర్భజలాలు కూడా ఉండవనే ఆందోళనతో గ్రామానికి చెందిన గొలకొండ శ్రీనివాస్‌తోపాటు పలువురు రైతులు ఏర్పాటు చేసిన రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్‌లో ఉండే గోలకొండ శ్రీనివాస్ నిత్యం గ్రామానికి వెళ్తూ తమ కుటుంబానికి ఉన్న ఏడెకరాల్లో వ్యవసాయాన్ని కూడా చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తొలుత రంగసముద్రం చెరువు రియల్ కబ్జా నీడలోకి పోతుందంటూ ‘నమస్తే తెలంగాణ’ను శ్రీనివాస్‌తోపాటు రైతులు ఆశ్రయించడంతో 2024 జనవరి 24న ‘రియల్ వలలో రంగసముద్రం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు స్పందించి చెరువును పునరుద్ధరించారు. దీంతో గత రెండేండ్లుగా ఆ చెరువులో జలకళ ఉట్టిపడుతున్నది.
ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినా రైతు సంఘం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాడ్గుల పోలీసులు సైతం చెరువులను కాపాడాలనే సదుద్దేశంతో రైతు సంఘానికి సహకరించారు. ఫలితంగానే రంగసముద్రం ఇప్పుడు బతికి బట్టగట్టింది. గ్రామ పరిధిలోని తుమ్మల కుంట చెరువు రియల్ వలలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతుందని గుర్తించిన రైతు సంఘం అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది గ్రామంలోని కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా మారింది.
గ్రామంలోని తుమ్మలకుంట (ఐడీ నంబరు-70831701401303) సుమారు 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. వాస్తవానికి ఇందులో ఏక్‌సాల్ పట్టాలు ఉన్నాయి. పట్టాదారులు శేషగిరిరావు, మధుసూదన్‌రావు తదితరులంతా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. ఆ భూముల్లో గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు అనుముల పాండురంగారెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాంరెడ్డి కుటుంబీకులు (కొండారెడ్డిపల్లి నుంచి వచ్చి ఈ గ్రామంలో స్థిరపడిన వారు) అందులో వ్యవసాయం చేసుకొంటున్నారు. చెరువులో నీళ్లు లేనపుడు శనగలు వేసి ఎంతోకొంత పట్టాదారులకు ఇచ్చేవారు. రియల్ ప్రభావంతో ఈ భూములను అమ్ముకొనేందుకు పట్టాదారులు నిర్ణయించారు.
ఈ మేరకు కౌలుదారులు ఏడాది క్రితమే ఒక రియల్ వ్యాపారితో సంప్రదింపులు జరిపినట్టుగా రైతు సంఘానికి సమాచారం అందింది. దీంతో పాటు నీటిపారుదల శాఖకు ఎన్వోసీ కోసం కూడా దరఖాస్తు అందిందని తెలువడంతో వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ భూముల లావాదేవీలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలిసి జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్‌ను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. శ్రీనివాస్ తండ్రి, సోదరుడిని కూడా బెదిరించడంతో ఏడాది క్రితమే వారు హైదరాబాద్‌కు వచ్చి అతని వద్దే ఉంటున్నారు. తమ భూముల లావాదేవీలు నిలిచిపోయాయనే కోపంతో కాంగ్రెస్ నేతలు తరచూ తనకు ఫోన్ చేసి గ్రామానికి వస్తే చంపుతామంటూ బెదిరించేవారని శ్రీనివాస్ తెలిపారు.
ఇటీవల పంచాయతీ ఎన్నికలు రావడంతో శ్రీనివాస్ కుటుంబం గ్రామానికి వచ్చేందుకు తామేమీ హాని తలపెట్టబోమంటూ వారంతా నమ్మబలికారని, దీంతో తన తండ్రి, సోదరుడితోపాటు గ్రామానికి వెళ్లానని, అక్కడికి వెళ్లిన వెంటనే ఆయా కుటుంబాలన్నీ మహిళలు సహా తమపై తీవ్రంగా దాడి చేశారని శ్రీనివాస్ చెప్పారు. గ్రామస్తులు కొందరు నిలువరించడంతో తమ ప్రాణాలు దక్కాయని, డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ తర్వాత మాడ్గుల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పినా పోలీసులు ఉల్టా తననే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల బెదిరింపులతో చేసేదేమీలేక ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, ఇటీవల కుమ్మెర ఘటన చూసిన తర్వాత ఎప్పటికైనా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నదనే భయంతో ఇప్పుడు బయటకొచ్చి మొరపెట్టుకుంటున్నానని శ్రీనివాస్ తెలిపారు. తమ కుటుంబం గ్రామంలో లేకపోవడంతో తమకున్న ఏడెకరాల్లోని పామాయిల్ పంట, డ్రిప్ పైపుల్ని ధ్వంసం చేసి, కాపలాగా ఉన్న వ్యక్తిని కూడా బెదిరించి అక్కడి నుంచి పంపించారని చెప్పారు. ఇప్పటికీ గ్రామంలోకి వెళ్లేందుకు తమ కుటుంబం భయపడుతుందని, సదరు కాంగ్రెస్ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉన్నదని శ్రీనివాస్ ఆందోళన వ్యక్తంచేశారు.