పువ్వు పుట్టగానే పరిమళించినట్టు పిల్లల సామర్థ్యాలు చిన్నప్పుడే బయటపడతాయి. వాటికి సానపడితే గొప్ప విజయాలు దక్కుతాయి. ఆటల పోటీల్లో రికార్డులు సృష్టిస్తూ పతకాలు గెలిచే క్రీడాకారులంతా అలా సాధన చేసినవాళ్లే. ఆరోగ్యం కోసం మొదలుపెట్టిన పరుగులో ఓ సాధారణ మహిళ రికార్డులు సృష్టిస్తున్నది! ప్యాషన్‌గా మొదలై ప్రొఫెషనల్ రన్నర్‌గా మారిన సూఫియా సూఫీ గిన్నిస్ రికార్డులతో పరుగుల రాణిగా దూసుకుపోతున్నది!
రాజస్థాన్‌లోని అజ్మీర్ సూఫియా స్వస్థలం. పదహారేళ్ల వయసులోనే వాళ్ల నాన్న చనిపోయాడు. తల్లి సంరక్షణలో పెరిగింది. ఢిల్లీ విమానాశ్రయంలో గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగంలో చేరింది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండేదట. ఒక్కోసారి రాత్రి వేళల్లో పని చేయాల్సి వచ్చేదట. పని వేళలు, పని భారం వల్ల ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆ మనోభారాన్ని తగ్గించుకోవాలనుకుంది. ఆరోగ్యం, ఫిట్నెస్ కాపాడుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు పరుగును తేలికైన యాక్టివిటీగా భావించింది. దీనికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే ప్రత్యేకమైన సెటప్ కూడా అవసరం లేదు. కాబట్టి తేలిగ్గా అయిపోతుందని పరిగెత్తడం మొదలుపెట్టింది. పరుగు పూర్తయిన ప్రతిసారీ ఆమె శరీరం అలసిపోయేది. కానీ, ఆమె మనసు ఉత్సాహంగా ఉండేది. ఈ రిలీఫ్ కోసం ప్రతిరోజూ రన్నింగ్ చేయడం విధిగా పెట్టుకున్నది.
ఫిట్నెస్ కోసం దూరం పెంచుకుంటూ, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నది సూఫియా. దూరం పెరుగుతున్నా కొద్దీ ఆమె శరీరం మరింత బలంగా తయారవుతున్న అనుభూతికి లోనైంది. అప్పుడే ప్రొఫెషనల్ అథ్లెట్‌గా పరిగెత్తాలని ఆలోచన చేసింది. ప్యాషన్‌గా మొదలైన పరుగుని ప్రొఫెషనల్‌గా మార్చుకుంది. సుదూర లక్ష్యాలను చేరుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే ఆమె జీవితాన్ని ఉన్నత లక్ష్యాల వైపు పరుగుతీసేలా చేసింది. పదేండ్లుగా పనిచేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టింది. పూర్తిగా పరుగుకే అంకితమై ‘కన్యాకుమారి టు కశ్మీర్ రన్’ లక్ష్యం ప్రకటించింది! కన్యాకుమారిలో సూర్యోదయాన్ని వీక్షించే తీరం నుంచి తొలి అడుగు వేసింది. ఒంటరిగా సుదూర లక్ష్యాన్ని చేరుకోవాలంటే శారీరక బలమే కాదు మనోైస్థెర్యమూ తోడవ్వాలి. కొండలు, కోనలు, అడవులు దాటి సాగే ప్రయాణంలో ఎన్నో ఆటంకాలుంటాయి. వాతావరణ పరిస్థితులు మారిపోతుంటాయి. వాటికి భయపడితే అడుగు ముందుకు పడదు. కన్యాకుమారిలో మొదలైన ఆమె ఎనభై ఏడు రోజుల, రెండు గంటల సమయంలో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చేరుకుంది. ఇంతదూరాన్ని అత్యంత వేగంగా పరిగెత్తిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సృష్టించింది సూఫియా. సుదూర లక్ష్యాన్ని చేరుకుని తన శారీరక సామర్థ్యాన్ని, మనోబలాన్ని చాటుకుంది. ఆడపిల్లలు సాధించలేరు అనేవాళ్ల నోళ్లు మూయించింది!
‘కన్యాకుమారి టు కశ్మీర్ రన్’ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత.. మనాలి నుంచి లేహ్ మధ్య అల్ట్రా మారథాన్‌కు సిద్ధపడిందామె. సముద్రమట్టానికి పదిహేడు వేల అడుగుల ఎత్తున్న అయిదు పర్వతాలను దాటుకుంటూ, 480 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడం అసాధారణం. తనను తాను అథ్లెట్‌గా భావించిన సూఫియా మిగతా క్రీడాకారుల్లాగా ట్రైనర్స్‌ని నియమించుకోలేదు. గాయపడితే సొంతంగా చికిత్స చేసుకోవడంలో శిక్షణ పొందలేదు. పరిగెత్తాలనే ఆలోచనతోపాటు దారిపొడవునా ఉమెన్ సేఫ్టీ, ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్ గురించి ప్రచారం చేయాలనే కార్యాచరణ తప్ప ఆత్మరక్షణ గురించి పట్టింపు లేదు. వేగంగా మారే ఉష్ణోగ్రతలు, గడ్డకట్టేంత చలి, ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే గాలిలో పరుగు అత్యంత కష్టమైనది, ప్రాణాంతకమైనది కూడా! క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో మానోధైర్యాన్ని కోల్పోకుండా స్పాన్సర్ సంస్థ మెంటల్ కండీషనింగ్ కోచ్‌ని నియమించింది. అలసిపోకుండా, ఆగిపోకుండా సూఫియా లక్ష్య దూరాన్ని చేరి ‘మనాలి టు లేహ్ అల్ట్రా మారథాన్ పూర్తి చేసిన మొదటి మహిళ’గా గిన్నిస్ రికార్డ్ సాధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాంగ్ రన్స్ చేస్తూనే ఉంది. మరెన్నో మారథాన్ ఈవెంట్లలో పాల్గొని అనేక విజయాలు, ఎన్నో రికార్డులు సాధించింది.
రికార్డులు సృష్టించడంతో ఆమె రన్నింగ్ మొదలైంది. పాత రికార్డులు తిరగరాయడానికి మరో పరుగు అందుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కి పరుగులు తీసి రికార్డు సృష్టించిన సూఫియా అదే చోట నుంచి, అదే మార్గంలో మళ్లీ బయల్దేరింది. ‘రన్ ఫర్ డ్రీమ్స్’ పేరుతో మే నెలలో పరుగు మొదలుపెట్టింది. మండే ఎండల్లో చెమటలు కక్కుతూ ఈ పరుగు సాగింది. పదకొండు రాష్ర్టాల గుండా వేగంగా దూసుకుపోయింది. ఈ పరుగులో దారి పొడవునా ఉన్న స్మృతి కట్టడాలను దర్శించి, వీర సైనికులకు నివాళులు అర్పిస్తూ ముందుకు సాగిపోయింది. 70 రోజుల్లో ఏ ఒక్క రోజూ ఉన్న చోటనే ఉండిపోలేదు. 68 రోజుల 23 గంటల సమయంలో శ్రీనగర్‌కు చేరుకుంది. 4,167 కిలోమీటర్ల దూరాన్ని అతి తక్కువ సయమంలో పరిగెత్తిన మహిళగా తన పేరిటే ఉన్న గిన్నిస్ రికార్డుని తనే తిరగరాసింది.
ఈసారి మరికొంత దూరం పరుగెత్తాలని సూఫియా లక్ష్యంగా పెట్టుకుంది. దక్షిణ భారత దేశంలో సరిహద్దు నుంచి మొదలైన తన పరుగుని ఉత్తర భారతావని సరిహద్దు దాకా కొనసాగించాలని నిశ్చయించుకుంది. అత్యంత చలి, పూర్తిగా పర్వత ప్రాంతమైన లద్దాఖ్‌లోని కారాకోరం పాస్ (చైనా సరిహద్దు ప్రాతం) దాకా పరిగెత్తాలని డిసైడ్ అయింది. జమ్ములో తన పరుగుకు ఆటంకం లేకుండా సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఒకటి రక్షణగా నిలిచింది. పర్వత ప్రాంతాల్లో పరిగెత్తే సమయంలో ఆమె లగేజీ భారాన్ని తగ్గించేలా సీఆర్పీఎఫ్ సహకరించింది. కారాకోరం పాస్ లక్ష్యాన్ని చేరుకుంటే 6వేల కిలోమీటర్ల సుదీర్ఘ పరుగుతో సూఫియా మరో గిన్నిస్ రికార్డ్ సృష్టిస్తుంది! గతంలో లక్ష్య దూరాలను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భాల్లో మాట్లాడుతూ ‘ఈ పరుగు పూర్తయ్యాక శరీరం అలసిపోయింది. కానీ, నా మనసులో శక్తి ఇంకా ఉంది’ అనేది సూఫియా. అంతకంటే ఎక్కువ దూరం పరుగెత్తాలనే కోరికను బయటపెట్టేది. అన్నట్టే దూరాలు పెంచుకుంటూ ఒక రికార్డు తర్వాత మరో రికార్డును సాధించుకుంటూ దుసుకుపోతున్న సూఫియాను మనమూ అభినందిద్దాం!