మహబూబ్‌నగర్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ – ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్‌బ్రదర్స్’ అండదండలు పుష్కలంగా ఉన్న షాడో! 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రెండువేలకు, ఐదువేలకు చెయ్యిచాచిన ఆ కుటుంబం ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేస్తున్న మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ ఓ కాంగ్రెస్ నేత జాతకాన్ని మార్చేసింది. వందలాది మంది రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని, అధికారులను అడ్డం పెట్టుకొని, పేద రైతుల కడుపు కొట్టి కోట్లకు పడగలెత్తాడు. నిర్వాసితులకు ఇచ్చిన భూములను కూడా కబళిస్తున్నారు. బిగ్‌బ్రదర్స్ ఆశీస్సులు ఉండటంతో ఇప్పుడు ఆ కుటుంబం హైదరాబాద్‌లోని విల్లాల్లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నది. ఓ రైతు తనకు పరిహారం రాలేదని వాట్సాప్‌లో మెసేజ్ పెడితే.. ‘నన్నే క్వశ్చన్ చేస్తవా? మీ ఇంటికి వచ్చి తంతా.. ఏమనుకుంటున్నావో..’ అంటూ బెదిరించారు.
మరో రైతు కుటుంబానికీ రూ.30 లక్షలు పరిహారం అందాల్సి ఉండగా, ‘ఎనిమిది లక్షలు ఇస్తాం. ఇస్తే తీసుకోండి లేకుంటే లేదు’ అని భయపెట్టారు. ఆ కుటుంబం ఎదురుతిరిగితే, ఆ ఇంటి మీద పోలీసులతో దాడి చేయించి రెండు రోజులు పోలీస్స్టేషన్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. దుద్యాల మండలంలో అధికార పార్టీ నేత రౌడీరాజ్యం నడుపుతున్నా ఇటు అధికారులు, అటు పోలీసులు నోరు మెదపడం లేదు. పేదల భూములను లాక్కొని పరిహారాన్ని కాజేస్తున్న వైనంపై వస్తున్న వరుస కథనాలు ‘బిగ్షాడో’ పునాదులను కదిలిస్తున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ కూడా ఆందోళనకు దిగింది. గులాబీ దండు హకీంపేట చౌరస్తాలో భారీ ధర్నా చేసి బిగ్షాడో సాగిస్తున్న గూండాగిరిపై ఎదురుతిరిగింది. ఒక్కొక్క రైతు గోడు వెళ్లబోసుకొంటుంటే ఈ బిగ్షాడో అక్రమాలు కాంగ్రెస్ నేతలనే అవాక్కయేలా చేస్తున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారుల అండదండలతో అరాచకం సృష్టిస్తున్న రౌడీరాజ్యంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
పేదలను ముంచి.. కోట్లకు పడగలెత్తి…
కొడంగల్ నియోజకవర్గంలో ఓ అధికార పార్టీ నేత చరిత్ర విస్తుగొలుపుతున్నది. సరిగ్గా మూడున్నరేండ్ల క్రితం అతనో మామూలు వ్యక్తి. ఆయనకు గ్రామంలో కనీసం రూ.5,000 కావాలన్నా అప్పు పుట్టని పరిస్థితి అట! ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా కోట్లాది రూపాయల వర్షం కురుస్తున్నది. ‘మన ఊరు- మన భవిష్యత్తు’ అంటూ ఊదరగొట్టి ప్రజాప్రతినిధిగా మారాడు. ఆ గ్రామ భవిష్యత్తు ఏమో కానీ, తన భవిష్యత్తు మాత్రం ఊహించని రీతిలో మలుపులు తిరిగింది. ఓ ముఖ్య నేత ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన ఆయన జాతకం.. ఆ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన మల్టీపర్పస్ ఎకనామిక్ కారిడార్‌తో మారిపోయింది. ముఖ్యనేత ఆశీస్సులతో విల్లాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. మరికొన్ని రోజుల్లో బెంజ్‌కారులో తిరిగి తన సత్తా ఏందో చూపిస్తానని అంటున్నాడట. అంతేకాకుండా, తన, తన కుటుంబానికి చెందిన సెంటు భూమి పోకున్నా నిర్వాసితుల జాబితాలో పేర్లు రాసుకొని కోట్లు కొల్లగొట్టేశాడనే ప్రచారం జరుగుతున్నది. అయితే, ఎంతో నమ్మకంగా ఓట్లు వేసిన తమకు, శఠగోపం పెడుతూ పేద ప్రజల కడుపు కొడుతున్నాడని ఊరి జనమే శాపనార్థాలు పెడుతున్నారు.
యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని..
దుద్యాల మండలం హకీంపేట, లగచర్ల, పోలేపల్లి గ్రామాలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గ పరిధిలో ఉండటంతో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు కోసం పెద్దఎత్తున భూములు సేకరించారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు 1,200కుపైగా ఎకరాలను సేకరించి తెలంగాణ మౌలిక సదుపాయాల పారిశ్రామిక సంస్థకు అప్పగించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం, అంతకుముందే జరిగిన భూసేకరణ గ్రామసభల్లో గందరగోళం నెలకొని గిరిజనులు తిరుగబడటంతో వారికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం భూముల సేకరణ మొదలుపెట్టింది. అప్పట్లో కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులపై దాడి చేశారంటూ పలువురు రైతుల మీద కేసులు పెట్టి, ఈ గ్రామాల్లోని ప్రధాన వర్గాల వాళ్లను అరెస్టు చేయించి జైల్లో పెట్టారు. అప్పుడు రంగంలోకి దిగిన ఈ బిగ్షాడో చక్రం తిప్పి మొత్తం కారిడార్‌కు తానే భూములు ఇప్పించినట్టు బిల్డప్ ఇచ్చారు. అసలే కాంగ్రెస్ నాయకుడు, అందునా ముఖ్యనేత ఇంట్లో వంట మనిషిగా పనిచేసిన అనుభవం ఉండటంతో నమ్మిన నేతలు ఇతన్ని ముందుపెట్టారు. ఇంకేముంది ముఖ్యనేత అండదండలతో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్‌పై పెత్తనం మొదలుపెట్టాడు. జిల్లా కలెక్టర్‌తోపాటు ఆర్డీవో, భూసేకరణ అధికారులు, తహసీల్దార్, ఇటు పోలీసుల్లో జిల్లా ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు ఈయన చెప్పిందే వేదంగా మారింది. అధికారులను అడ్డంపెట్టుకొని అవినీతి సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నాడు.
నిర్వాసితుల ప్లాట్లను కూడా చెరబడుతూ..
భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఉచితంగా అన్ని వసతులతో కూడిన కారిడార్‌లో పెద్ద ఎత్తున లేఅవుట్ చేసి భారీ వెంచర్‌ను తయారు చేసింది. దీనిని పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్నారు. అధికారులను తన గుప్పిట్లో పెట్టుకొన్న సదరు నేత.. పేదలకు ఇచ్చిన ప్లాట్లలో దందా మొదలుపెట్టాడు. ఇప్పటివరకు 50 నుంచి 60 ప్లాట్లను బాధితుల నుంచి లాక్కుంటున్నట్టు ఆరోపణలున్నాయి. ఇలా ప్లాట్లను లాక్కొని ఈ కాలనీలో బడా పారిశ్రామికవేత్తలకు అమ్మేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.
పరిహారం అడిగితే బెదిరింపులు
నా భూమికి పరిహారం ఇవ్వండి మహాప్రభో.. అంటూ అధికారుల చుట్టూ తిరిగి విసిగి పోయాను. కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించడం లేదు. చివరకు ముఖ్యమంత్రికి కూడా స్పీడ్‌పోస్టులో అర్జీలు పెట్టుకున్నాను. మా అమ్మ దొడ్డి లింగమ్మ పేరు మీద సర్వే నంబర్ 252/68/1లో రెండు ఎకరాల భూమి ఉన్నది. 2005లో మాకు పట్టా ఇచ్చారు. నోటిఫికేషన్లో కూడా మా పేర్లు వచ్చాయి. కానీ, పరిహారం ఇవ్వలేదు. దీంతో మా గ్రామానికి చెందిన నర్సింహారెడ్డిని కలిసి పరిహారం ఇప్పించాలని అడిగిన. వారం రోజుల్లో ఇప్పిస్తానని ఇప్పించలేదు. సోషల్‌మీడియాలో పరిహారంపై చర్చ జరుగుతుంటే నేను నిలదీశాను. నా గురించి సోషల్ మీడియాలో పెడుతవా? అంటూ నన్ను బెదిరించాడు.మా భూమిని గుంజుకొని పనులు చేస్తున్నారు.
– దొడ్డి చంద్రమౌళి,హకీంపేట గ్రామం, కొడంగల్ నియోజకవర్గం.
8 లక్షలేనా ఇచ్చేది?
మా నాన్న పేరు మీద పోలేపల్లి గ్రామంలో సర్వే నంబర్ 67లో ఒక ఎకరా 20 గుంటల భూమి ఉన్నది. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. మా గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి రూ.30 లక్షలు ఇవ్వబోమని, ఎనిమిది లక్షలే ఇస్తామని చెప్పాడు. దౌర్జన్యంగా మా భూములను లాక్కున్నారు. ఇదేమిటని అడిగితే అర్ధరాత్రి 40 మంది పోలీసులు మా ఇంటికి వచ్చి, మా నాన్న ఎల్లప్పతోపాటు మా బంధువులను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఈ నెల 1న శనివారంనాడు తీసుకెళ్లి, మరుసటి రోజు ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు మహిళలను వదిలిపెట్టారు. అర్ధరాత్రి ఒంటిగంటకు మా నాన్నతోపాటు మిగతా వారిని వదిలిపెట్టారు. ఇది జరిగి వారం అవుతున్నా నాకు న్యాయం జరుగడం లేదు. ఇప్పటికైనా అధికారులు మా కుటుంబానికి పరిహారం ఇవ్వాలి.
– అంతారం బాలరాజు,పోలేపల్లి గ్రామం, కొడంగల్ నియోజకవర్గం
